Nagababu: జనసేనలో( janasena ) నాగబాబు ప్రాధాన్యత తగ్గిందా? తగ్గించుకున్నారా? మునుపటి మాదిరిగా ఆయన ఎందుకు యాక్టివ్ గా లేరు? పవన్ కళ్యాణ్ నియంత్రించారా? ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. జనసేనలో పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరూ అంటే మాత్రం కుటుంబ పరంగా నాగబాబు ముందుంటారు. లేకుంటే నాదేండ్ల మనోహర్ ఉంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కష్టకాలంలో ఉండగా ఆయనను నమ్మి పార్టీలోకి వచ్చారు మనోహర్. ఇద్దరూ కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లగలిగారు. దానికి తన వంతు సాయం అందించారు నాగబాబు. అయితే ఇప్పుడు నాగబాబు జనసేనలో ఎమ్మెల్సీ. కాబోయే మంత్రి కూడా. అయినా సరే నాగబాబు వాయిస్ పెద్దగా వినిపించడం లేదు. దానికి కారణం ఏమై ఉంటుందా? అనే చర్చ మాత్రం నడుస్తోంది.
* దూకుడు స్వభావం..
మెగా బ్రదర్స్ లో చిరంజీవి( megastar Chiranjeevi) మృదుస్వభావి. పవన్ కళ్యాణ్ దూకుడుగా ఉంటారు. అయితే రాజకీయాల్లో ఆయనకు ఎదురైన పరిణామాలతో క్రమేపి ఆయన వ్యూహాత్మకంగా మాట్లాడతారు. పైగా చిరంజీవితో సమానమైన స్టార్ డం ఉంది. చిరంజీవికి మించి ప్రభావితం చేయగల శక్తి పవన్ కళ్యాణ్ కు ఉంది. అయితే మెగా బ్రదర్ నాగబాబు సైతం పవన్ మాదిరిగా దూకుడుగా ఉంటారు. కానీ ఆయన చిరంజీవి, పవన్ సోదరుడు గానే చూస్తారు తప్పించి.. ఆయనకంటూ ప్రత్యేక ఇమేజ్ లేదు. అయితే గతంలో నాగబాబు చాలా చురుగ్గా ఉండేవారు. అంతకుమించి ఆయన కామెంట్స్ వివాదాస్పదం అయ్యేవి. జనసేన ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఆయన తెలుగుదేశం పార్టీని ఎక్కువగా టార్గెట్ చేసేవారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలకు భిన్నంగా ఆయన కామెంట్స్ సాగేవి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వండడం వల్లే నాగబాబును పవన్ కళ్యాణ్ కట్టడి చేస్తున్నట్లు తెలుస్తోంది.
* కాచుకుని కూర్చున్న వైసిపి..
కూటమి( Alliance ) తప్పిదాలను బయటపెట్టాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాచుకొని కూర్చుని ఉంది. ఎంత మాత్రం చిన్నపాటి వ్యాఖ్యలు దొర్లిన దానిని హైలెట్ చేసేందుకు వందలాదిమంది సోషల్ మీడియా సైన్యం ఉంది. మొన్న బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవి ప్రస్తావన తెచ్చేసరికి ఆయనపై లేనిపోని కథలు అన్నారు. చిరంజీవిని బాలకృష్ణ దారుణంగా దూషించారని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అంతటితో ఆగకుండా అదే సభలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ నాగబాబు సైతం అడ్డుకోలేకపోయారని ఊరు వాడ ప్రచారం చేయగలిగారు. కూటమి ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరుగుతోందని చెప్పుకొచ్చారు. ఆ ఒక్క ఘటన కాదు పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఏ చిన్న అంశం అయినా సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో దూకుడు స్వభావం కలిగిన నాగబాబు మాట్లాడితే కచ్చితంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అందుకే నాగబాబు వీలైనంతవరకు సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.