Congress: వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ ద్రోహం చేసిందా? కాంగ్రెస్ ను వైఎస్ కుటుంబం ద్రోహం చేసిందా? అన్న చర్చ ఏపీలో ప్రారంభమైంది. తన చెల్లి, తల్లిని దూరం చేసి కాంగ్రెస్ తనకు అన్యాయం చేసిందని జగన్ ఆవేదన ఒకవైపు, తమ కుటుంబానికి ఎప్పుడు కాంగ్రెస్ అన్యాయం చేయలేదని.. ఈ రాష్ట్రాన్ని పాలించే అధికారాన్ని కట్టబెట్టిందని షర్మిల మరోవైపు గుర్తు చేస్తున్నారు. దీంతో ఎవరిది ద్రోహం? అన్న ప్రశ్న తలెత్తుతోంది. కాంగ్రెస్ లేకుంటే వైఎస్ కుటుంబమే లేదని.. వేలకోట్ల అక్రమ ఆర్జన ఎలా వచ్చి ఉండేదని.. కాంగ్రెస్ గుర్తుంచకుంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యుండేవారా? సీఎంగా ఉంటూ రాజశేఖర్ రెడ్డి చనిపోవడం వల్లే జగన్ కు ఈ స్థాయి గుర్తింపు లభించింది కదా? ఇలా గొలుసు ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డి కొద్దిరోజుల పాటు కాంగ్రెస్ నాయకత్వానికి దూరమైనా.. తరువాత మాత్రం గాంధీ కుటుంబానికి దగ్గరయ్యారు. వీర విధేయత ప్రదర్శించారు. కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలను తీసుకున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి తాను అండగా నిలబడ్డారు. నాయకత్వం సైతం ఆయనకు స్వేచ్ఛనిచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి నియమించింది. రెండోసారి కూడా ఆయనకే పదవి ఇచ్చి గౌరవించింది. కేంద్ర ప్రభుత్వపరంగా ఆయాచిత లబ్ధి ఏపీకి చేకూర్చింది. ఆరోగ్యశ్రీ, 108, జలయజ్ఞం వంటి పథకాలకు భారీగా నిధులు సమకూర్చి.. రాజశేఖర్ రెడ్డి కి ఇంతటి పేరుకు కాంగ్రెస్ పార్టీ కారణమైంది.
జగన్ సుదీర్ఘ రాజకీయ నాయకుడు కాదు. పేరు మోసిన పదవులు చేపట్టలేదు. కేవలం తండ్రిని అడ్డం పెట్టుకుని కడప ఎంపీ మాత్రమే అయ్యారు. ఆయనకు ఉన్న ఏకైక అర్హత కూడా రాజశేఖర్ రెడ్డి కుమారుడు కావడమే కారణం.కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆయన నాయకుడిగా ఎదిగారు. ఆ నాయకత్వం ఫలితాలను జగన్ అనుభవించారు. కానీ రాజశేఖర్ రెడ్డి కి ఆ స్థాయి గౌరవానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ కారణం. కానీ రాజశేఖర్ రెడ్డికి గౌరవం కల్పించిన కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చిన జగన్.. తండ్రి గౌరవాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. తన కుటుంబానికి ఇంతటి అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీశారు.
హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర్ రెడ్డి చనిపోయారు. ఓదార్పు యాత్రకు సిద్ధపడ్డారు. కాంగ్రెస్ నాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేసినా వినలేదు. జైలు జీవితానికి కూడా జగన్ సిద్ధపడ్డారు. 16 నెలల పాటు జైలులోనే గడిపారు. అటు తరువాత వైసీపీని ఏర్పాటు చేసి జగన్ అధికారంలోకి రాగలిగారు. కానీ కాంగ్రెస్ పార్టీని హైజాక్ చేశారన్న అపవాదును మూటగట్టుకున్నారు .తల్లి,చెల్లిని తన అవసరాల కోసం వినియోగించుకొని.. అధికారంలోకి వచ్చాక బయటకు పంపించేశారన్న విమర్శను కూడా ఎదుర్కొంటున్నారు. ఒకానొక దశలో తన తండ్రి మరణానికి కారణం సోనియా గాంధీయేనని కుటుంబ సభ్యులతోనే ఆరోపణలు చేయించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లి, తల్లిని పట్టించుకోకపోయేసరికి.. వారు కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించారు. ఆ పార్టీ గొడుగు కిందకు చేరారు. ఈ క్రమంలోనే ద్రోహం ఎవరు చేశారు? అన్న బలమైన చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీలోకి చెల్లి షర్మిల చేరడంతో.. వైఎస్ కుటుంబ అభిమానుల్లో సైతం ఒక రకమైన చేంజ్ కనిపిస్తోంది. అది ఎవరికి నష్టం చేకూరుస్తుందో చూడాలి.