AP DGP
AP DGP: ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా( Harish Kumar Gupta) నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 31న ప్రస్తుత డిజిపి ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ కుమార్ గుప్తాను తదుపరి డిజిపిగా నియమించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అయినా హరీష్ కుమార్ గుప్తా పోలీస్ శాఖలో వివిధ హోదాలో పని చేశారు. 1992 బ్యాచ్ కు చెందిన హరీష్ కుమార్ ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ హరీష్ కుమార్ గుప్తాను డిజిపిగా నియమించింది. కొద్దిరోజులపాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు. కూటమి ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్నాక ఆయన స్థానంలో ద్వారకా తిరుమల రావు వచ్చారు. ఆయన ఈ నెల 31న రిటైర్ కానున్నారు.
* జమ్మూ కాశ్మీర్ సొంత రాష్ట్రం
జమ్మూ కాశ్మీర్ కు( Jammu Kashmir) చెందిన హరీష్ కుమార్ గుప్తా.. గతంలో పలు జిల్లాలకు ఎస్పీగా కూడా పనిచేశారు. కొత్త డిజిపి రేసులో మాదిరెడ్డి ప్రతాప్ కూడా ఉన్నారు. కానీ హరీష్ కుమార్ గుప్తా వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. మరోవైపు ద్వారకాతిరుమలరావు ఆర్టీసీ ఎండి గాను కొనసాగుతున్నారు. అయితే డిజిపిగా పదవీ విరమణ చేయనున్న ఆయన సేవలను ఆర్టీసీ ఎండీగా వినియోగించుకుంటారని తెలుస్తోంది. గతం నుంచి ఆర్టీసీ ఎండిగా బాధ్యతలు చేపడుతూ వస్తున్నారు. జగన్ హయాంలోనే ఆయన నియమితులయ్యారు. ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు.
* శాంతి భద్రతల పై ప్రత్యేక ఫోకస్
రెండు రోజుల్లో పదవీ విరమణ చేయనున్న డిజిపి ద్వారకా తిరుమలరావు నరసరావుపేట జిల్లాలో( Narasaraopet district ) పర్యటించారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన డాగ్ స్క్వాడ్, జిల్లా పరేడ్ గ్రౌండ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడారు. రాష్ట్రంలో తమకు ప్రస్తుతం ఐదారు ప్రధాన అంశాలు లక్ష్యంగా ఉన్నాయని చెప్పారు. ఇటీవల కాలంలో ఫేక్ పోలీసులు, కోర్టులు, లాయర్లు, అమాయకులకు ఫోన్లు చేసి డబ్బులు గుంజుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్ ను పూర్తిగా నియంత్రిస్తామని చెప్పారు. సైబర్ క్రైమ్ రూపంలో దోపిడీ ఎక్కువగా జరుగుతోందని తెలిపారు. టెక్నాలజీని వాడుకుని సాధ్యమైనంత ఎక్కువగా వాటిని అరికడతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సోలార్ ప్యానల్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డ్రోన్లు సైతం వినియోగిస్తున్నట్లు చెప్పారు.
* ఎన్నికల సమయంలో డిజిపిగా
అయితే హరీష్ కుమార్ గుప్తాను( Harish Kumar Gupta) డీజీపీగా ఎంపిక విషయంలో కేంద్ర పెద్దలు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నికల సమయంలో అప్పటివరకు ఉన్న డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికల కమిషన్ మార్చింది. ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను నియమించింది. అయితే కూటమి సర్కార్ ఆయననే కొనసాగిస్తుందని అంతా భావించారు. అయితే మధ్యలో సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న ద్వారకాతిరుమలరావును తెరపైకి తెచ్చింది. అయితే ఇప్పుడు కేంద్ర పెద్దలు సిఫారసు చేయడంతో సీఎం చంద్రబాబు కాదనలేకపోయారని తెలుస్తోంది. హరీష్ కుమార్ గుప్త జనవరి 1న బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. మొత్తానికి అయితే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియమితులయ్యారు. ఇప్పుడు కొత్త వ్యక్తి డిజిపిగా రానున్నారు. అంటే కీలక పోస్టుల భర్తీ పూర్తయింది అన్నమాట.