MLA Yarapatineni Srinivasa Rao: ఈ ఎన్నికల్లో పల్నాడు, మాచర్లలో విధ్వంసకర ఘటనలు జరిగాయి. రాయలసీమ సంస్కృతిని తలపించాయి. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఏకంగా పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంలను ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వైసిపి హయాంలో మాచర్ల, పల్నాడు లో ఎన్నో వివాదాస్పద ఘటనలు కూడా జరిగాయి. టిడిపి హయాంలో సైతం పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉండేది. అప్పట్లో యరపతినేని శ్రీనివాసరావు దూకుడుగా ఉండేవారు. ఆయన వ్యవహార శైలి సైతం వివాదాస్పదంగా ఉండేది. తాజాగా ఆయన మరోసారి గురజాల ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సంచలనంగా మారుతున్నాయి.
గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు రెండు రోజుల కిందట నియోజకవర్గ సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.’ నాకు ప్రశాంతమైన పల్నాడు కావాలి. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గం చాలు. మళ్లీ అటువంటి ఉదంతాలు జరగడానికి వీల్లేదు. నేను పోలీసులకు చెప్పేది ఒక్కటే. టిడిపి వాళ్లు దాడులకు పాల్పడిన కేసులు పెట్టండి. తప్పు ఎవరిదైతే వారిని శిక్షించండి. వైసిపి నాయకులకు, కార్యకర్తలకు ఒకటే చెబుతున్నా. ఎవరు ఊర్లు వదిలిపెట్టి వెళ్లొద్దు. హాయిగా మీ భార్యా పిల్లలతో కలిసి జీవించండి. మీ వ్యవసాయం, వ్యాపారాలు మీరు చేసుకోండి. నీ పనులు మీరు చక్కదిద్దుకోండి. నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. ఒకవేళ మా వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరే నాకు ఫోన్ చేయండి’ అంటూ ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఇచ్చిన పిలుపు ఇప్పుడు సంచలనం గా మారింది. తక్కువ సమయంలో సుమారు కోటి మందికి పైగా ఈ వీడియోను వీక్షించడం హాట్ టాపిక్ గా మారింది.
రాష్ట్రంలో వివాదాస్పద నియోజకవర్గాల్లో గురజాల ఒకటి. గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన యరపతినేని శ్రీనివాసరావు ఓడిపోయారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఈ నియోజకవర్గంలో విధ్వంసాలు చోటు చేసుకున్నాయి. వేలాది టిడిపి కుటుంబాలు ఉన్నపాటున ఊర్లు వదిలి వెళ్ళిపోయాయి. ఒకటి రెండుసార్లు టిడిపి కీలక నేతలపై నేరుగా దాడులు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. పల్నాడులో బాధితుల పరామర్శకు వెళుతున్న బొండా ఉమా, బుద్దా వెంకన్న వాహనంపై నేరుగా దాడి చేశారు కూడా. అయితే ఈ పరిస్థితిల్లో ప్రజల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. ఇటువంటి వాతావరణానికి ఫుల్ స్టాప్ పడాలన్న కోరిక అందరిలో ఉంది. ఈ తరుణంలోనే యరపతనేని శ్రీనివాస రావు చేసిన కామెంట్స్ వైసీపీ శ్రేణులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. కొందరు ఈ మంచి వాతావరణాన్ని ఆహ్వానిస్తున్నారు కూడా.