MLA Najir Ahmad: తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party ) మరో కలకలం. అధికార పార్టీ ఎమ్మెల్యే పై సొంత పార్టీ నేతల తిరుగుబాటు చేశారు. నిరసన వ్యక్తం చేసే క్రమంలో ఒక్కసారిగా ఆయనపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఎమ్మెల్యే కు స్వల్ప గాయాలయ్యాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్( najir Ahmad ) పై సొంత పార్టీ నేతలు దాడికి దిగారు. తమకు సమాచారం ఇవ్వకుండా ప్రైవేటు కార్యక్రమానికి ఎందుకు హాజరయ్యారంటూ నిలదీశారు. దీంతో ఇరు వర్గాలు గొడవకు దిగాయి. ఒక వర్గం వారు ఎమ్మెల్యే పై దాడికి ప్రయత్నించారు. పోలీసులు వచ్చి నిలువరించారు. మొన్నటి ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి నజీర్ అహ్మద్ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే నియోజకవర్గంలో టిడిపిలో విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఒక వర్గానికి కొమ్ము కాయడంతో.. దానికి దిగినట్లు సమాచారం.
* ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు
గుంటూరు ( Gunturu) నగర పరిధిలోని ఒకటో డివిజన్లో స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. అక్కడ డివిజన్ టిడిపి అధ్యక్షుడిగా సయ్యద్ ఇంతియాజ్ ఉన్నారు. ఆయన సోదరుడు ఫైరోజ్ గత ఎన్నికల్లో ఈ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన నగర టిడిపి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అయితే తమకు తెలియకుండా ఎమ్మెల్యే ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు కావడంపై ఇంతియాజ్, ఫై రోజ్ సోదరులతో పాటు ఆయన సమీప బంధువు రియాజ్ ఎమ్మెల్యే నజీర్ అహమ్మద్ను నిలదీశారు. అయితే దీనిపై ఎమ్మెల్యే సముదాయించే ప్రయత్నం చేశారు. వినకపోవడంతో తీవ్రస్థాయిలో హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా ఇంతియాజ్ తో పాటు ఫై రోజ్ దాడికి ప్రయత్నం చేశారు. చొక్కా పట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని ఎమ్మెల్యేకు రక్షణగా నిలిచారు.
* టిడిపిలో విభేదాలు
అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా నియోజకవర్గం టిడిపిలో ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ ఘటనలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపడుతున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం లో ముస్లింల ప్రాబల్యం అధికం. అందుకే ఈ ఎన్నికల్లో నజీర్ అహమ్మద్ కు( najir Ahmad ) టికెట్ ఇచ్చారు. అయితే ఎమ్మెల్యే ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. దాని ఫలితంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే పై సొంత పార్టీ నేతల దాడికి పాల్పడడం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై టిడిపి హై కమాండ్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే వివరాలు తెప్పించుకున్న అధిష్టానం చర్యలకు దిగనున్నట్లు తెలుస్తోంది.
* వరుస పరిణామాలతో
వరుసగా జరుగుతున్న పరిణామాలతో తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) నాయకత్వం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. మొన్నటి వరకు లోకేష్ డిప్యూటీ సీఎం ఇష్యూ నడిచింది. జనసేనతో సోషల్ మీడియాలో పెద్ద వార్ నెలకొంది. అది మరవక ముందే లోకేష్ ను టిడిపి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో టిడిపి నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు గుంటూరులో ఏకంగా ఎమ్మెల్యే పైనే సొంత పార్టీ నేతలు దాడికి దిగడం సైతం ఆందోళనకు గురిచేస్తోంది. పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే మున్ముందు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.