Gudivada Amarnath : మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక గుడివాడ అమర్నాథ్ మంచి గుర్తింపు సాధించారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అయ్యారు. గుడ్డు మంత్రిగా గుర్తింపు పొందారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న అమర్నాథ్ గ్రేటర్ విశాఖ కార్పొరేటర్ గా కూడా పదవి చేపట్టారు. వైసీపీలోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యారు. మంత్రిగా జాక్ పాట్ కొట్టేశారు. కానీ తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పై విమర్శలు చేయడంలో ముందంజలో ఉండేవారు. ఈయనదంతా కామెడీ జోనర్. మిగతా వైసిపి నేతల తరహాలో బూతులు మాట్లాడకపోవడం మంచి విషయమే. అయితే మంత్రి స్థాయికి తగ్గట్టు హుందాగా మాట్లాడకపోవడంతో చాలా సందర్భాల్లో విమర్శలకు గురయ్యారు.
సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కొన్న వైసీపీ నేతల్లో గుడివాడ అమర్నాథ్ ముందుంటారు. ఏపీలో పరిశ్రమలు లేకపోవడానికి గురించి స్పందిస్తూ ఓ సందర్భంలో ఆయన చెప్పిన కోడిగుడ్డు పురాణం సోషల్ మీడియాను షేక్ చేసింది. గుడివాడ అమర్నాథ్ కాస్త.. గుడ్డు అమర్నాథ్ గా మారిపోయారు. పరిశ్రమల శాఖ మంత్రిగా దావో సదస్సుకు ఎందుకు వెళ్లలేదంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుందని చెప్పి హాస్యం పండించారు. ఏపీ ప్రజలకు వినోదాన్ని పంచారు. ఏకంగా శాసనసభలో ఏయే పరిశ్రమలు వచ్చాయి అంటే.. అప్పడాలు, పచ్చళ్ళ పరిశ్రమల పేర్లు చెప్పి కడుపుబ్బ నవ్వించారు. అయితే అప్పట్లో అధికారంలో ఉన్నారు కాబట్టి చెల్లుబాటు అయ్యింది. ఇప్పుడు విపక్షంలోకి వచ్చినా అదే తరహా మాటలతో ట్రోల్ కు గురవుతున్నారు.
తాజాగా వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలకు సంబంధించి మీడియాలో, సోషల్ మీడియాలో వెలుగు చూస్తున్న వ్యవహారాలపై గుడివాడ అమర్నాథ్ స్పందిస్తున్నారు. రుషికొండ ప్యాలెస్ విషయంలో ఆయన తమ ప్రభుత్వ తప్పేమీ లేదన్నట్టుగానే మాట్లాడారు. లేటెస్ట్ గా ఆయన అమరావతిలో వైసీపీ ఆఫీస్ కూల్చివేత నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత తర్వాత.. ఏపీవ్యాప్తంగా ఆ పార్టీ కార్యాలయాలకు నోటీసులు అందజేయడం పై స్పందించారు. ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు తడబడ్డారు.’ అధికారంలో ఉండగా మా ప్రభుత్వం చేసిన కూల్చివేతల వల్లే ఈరోజు ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది. లేదంటే ఈరోజు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేస్తూ ఉండేవాళ్ళం’ అని వ్యాఖ్యానించారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది పార్టీకి ఇరుకున పెట్టే మాటే. అంటే విధ్వంసాలు చేశాం కాబట్టి ఓడిపోయామని ఒప్పుకున్నట్టే. దీనిపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీనియర్ నేతలు ఎవరు ముందుకు రాని తరుణంలో గుడివాడ అమర్నాథ్ స్పందిస్తుండగానే ఆహ్వానిస్తూనే.. ఇటువంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.