Great opportunity for Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల( government medical colleges) అంశానికి సంబంధించి గత కొద్ది రోజులుగా రచ్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. దానిని వ్యతిరేకిస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి అయితే ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణకు టెండర్లు దాఖలు చేస్తే.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. దీంతో నాలుగు కాలేజీల నిర్మాణానికి సంబంధించిన టెండర్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తే.. ఒక కాలేజీకి మాత్రమే దరఖాస్తు వచ్చింది. అయితే జగన్ హెచ్చరికలతోనే ప్రైవేట్ సంస్థలు బయటపడ్డాయని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఎంట్రీ ఇచ్చింది. దీంతో జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారు అనేది హాట్ టాపిక్ అవుతోంది.
కోటి సంతకాలతో హడావిడి..
కూటమి ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడతామని చెబుతోంది. ఇప్పటికే చాలా రకాల అంశాలు ఇదే విధానంలో కొనసాగుతున్నాయని గుర్తు చేసింది. ఆరోగ్యశ్రీ తో పాటు 104, 108 వంటివి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంతోనే నడుస్తున్నాయని గుర్తు చేసింది. కానీ దీంతో ఏకీభవించలేదు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కూడా చేపట్టారు దీనిపై. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా ఏకంగా అరెస్టులు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ స్పందించారు. ఆయన బిజెపికి చెందిన నేత కావడంతో నేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కేంద్రం సీరియస్ గా స్పందించడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైనట్లు తెలుస్తోంది.
స్పందించిన జేపీ నడ్డా..
జాతీయ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా జేపీ నడ్డా ఉన్నారు. ఏపీలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం గురించి అభినందించారు. మంచి విధానం అంటూ అభిప్రాయపడ్డారు. రాష్ట్రమంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రత్యేకంగా లేఖ రాయడంతో.. స్పందించారు కేంద్రమంత్రి జేపీ నడ్డా. ఇప్పటివరకు ఇది కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు బిజెపి పరిధిలోకి వెళ్లడంతో జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారు అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఎందుకంటే బిజెపి విషయంలో జగన్మోహన్ రెడ్డి వైఖరి సానుకూలంగానే ఉంటుంది. ఇప్పుడు గాని బిజెపికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితేనే ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో చిత్తశుద్ధితో ఉన్నట్టు. ఒకవేళ బిజెపిపై విమర్శలు చేయకుండా.. కేంద్రమంత్రి జేపీ నడ్డా అభిప్రాయాన్ని వ్యతిరేకించకుండా ఉంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో చులకన కావడం ఖాయం.. అయితే ఇప్పటికే కేసులతో పాటు అనేక రూపాల్లో ఆయన భయపడుతున్నారు బిజెపికి. ఇటువంటి సమయంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశంతో జగన్ ఇరకాటంలో పడినట్టు కనిపిస్తున్నారు.