Chandrababu: నిన్న వైసీపీ సేవలో .. నేడు చంద్రబాబు కోసం.. అధికారులది వింత పరిస్థితి

గత ఐదు సంవత్సరాలుగా వైసిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి సంచలనాలు సృష్టించాయో అందరికీ తెలిసిన విషయమే. చాలాసార్లు పాలకులు చేసిన తప్పిదాలకు అధికారులు మూల్యం చెల్లించుకున్నారు.

Written By: Dharma, Updated On : May 20, 2024 6:43 pm

Chandrababu

Follow us on

Chandrababu: పాలించే పార్టీలకు అనుకూలంగా వ్యవహరించాలి అధికారులు. మనదేశంలో బ్యూరోక్రాసి వ్యవస్థ కంటే.. రాజకీయ వ్యవస్థకే అధికారాలు ఎక్కువ. ఒక అధికారికి 62 సంవత్సరాల కు పదవీ విరమణ ఉంటే.. ప్రజా ప్రతినిధికి మాత్రం ఐదేళ్లు పదవీకాలం. కానీ ఈ ఐదేళ్లలో శాసిస్తారు ప్రజాప్రతినిధులు. వారి శాసనాలను అమలు చేసే బాధ్యతలు తీసుకుంటారు అధికారులు. అయితే ఎవరు అధికారంలోకి ఉంటే వారికి అనుగుణంగా పని చేయాల్సిన బాధ్యత అధికారులది. అదే ఇప్పుడు వారి పాలిట శాపంగా మారింది. ఏపీలో దౌర్భాగ్య పరిస్థితులకు కారణమైంది.

గత ఐదు సంవత్సరాలుగా వైసిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి సంచలనాలు సృష్టించాయో అందరికీ తెలిసిన విషయమే. చాలాసార్లు పాలకులు చేసిన తప్పిదాలకు అధికారులు మూల్యం చెల్లించుకున్నారు. కోర్టులో చివాట్లు తిన్నారు. వసతి గృహాల్లో పిల్లలకు భోజనం పెట్టడం, ప్రతి వారం విజిట్ చేయడం వంటి విచిత్ర శిక్షలను ఎదుర్కొన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయడం ద్వారా విపక్షాలు టార్గెట్ అయ్యారు. ఇప్పుడు అదే విపక్షానికి అధికారం రానుందని సంకేతాలు రావడంతో సతమతమవుతున్నారు. అందుకే వారి ప్రాపకం కోసం ప్రయత్నాలు చేయాల్సిన అనివార్య పరిస్థితులు వారికి దాపురించాయి.

రాష్ట్రంలో అధికార మార్పిడి ఖాయమన్న సంకేతాలు వస్తున్నాయి. టిడిపి కూటమికి అనుకూల పవనాలు ఇస్తున్నాయి. సహజంగానే వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారులకు ఇది రుచించని విషయం. ఇప్పటికే టిడిపి ఫిర్యాదులతో రాష్ట్ర డిజిపి తో పాటు చాలామంది అధికారులపై వేటు పడింది. రకరకాల కారణాలు చూపుతూ కొందరిపై సస్పెన్షన్ వేటుపడగా.. మరికొందరిపై బదిలీ వేటు వేశారు. అదే సమయంలో వైసీపీ పెద్దలకు ఆయాచితంగా సహకరించిన అధికారులు రెడ్ బుక్కులో చేరారు. తప్పు చేసిన ఏ అధికారిని విడిచిపెట్టే ఛాన్స్ లేదని.. వారందరి పేర్లు రెడ్ బుక్కులో రాసుకున్నామని విపక్ష నేతలు చాలాసార్లు హెచ్చరించారు. ఇప్పుడు అటువంటి అధికారులంతా భయపడుతున్నారు.వారంతా తమ పరిస్థితి ఏంటన్న ఆందోళనతో ఉన్నారు. మరోవైపు వైసీపీ బాధిత అధికారులు సైతం ఉన్నారు. టిడిపి సానుభూతిపరులన్న కోణంలో వారిని దూరం పెట్టారు గత ఐదేళ్లుగా. అటు వైసిపి అనుకూల వర్గంగా పేరు పొందిన అధికారులు, ఇటు వైసీపీ బాధ్యత అధికారులు టిడిపి, బిజెపి, జనసేన నేతల ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారు. వారి ద్వారా చంద్రబాబును సంప్రదించే పనిలో పడ్డారు. తమ తప్పు ఏమీలేదని ఒకరు.. గత ఐదేళ్లుగా టిడిపి మనుషుల మని ఇబ్బంది పెట్టినట్లు మరొకరు.. ఇలా అధికారిక గణమంతా కొత్త పాలకుల సిఫారసుల కోసం ప్రయత్నాలు చేస్తుండడం విశేషం.