Google Data Center: విషయాన్ని విషయం తీరుగా.. నిజాన్ని నిజం తీరుగా.. అబద్దాన్ని అబద్ధం తీరుగా చెప్పగలిగే వారినే మేధావులు అంటారు. మేధావులను ఈ సమాజం బుద్ధి జీవులు అని పిలుస్తుంటుంది. ఎందుకంటే మేధావులు తమ వివేచన ద్వారా సమాజాన్ని ప్రభావితం చేయగలరు. చీకట్లో ఉన్న సమాజాన్ని జాగృతం చేయగలరు. కానీ నేటి కాలంలో కొంతమంది మేధావులు తమ మేధస్సును అమ్ముకుంటున్నారు. అర మెదడు జ్ఞానంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.
ఇటీవల విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. గూగుల్ ప్రతినిధులు.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్.. ఇతరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గూగుల్ డాటా సెంటర్ ఏర్పాటు, దాని వల్ల వచ్చే అవకాశాలు.. ఆర్థిక పురోగతి.. వీటి గురించి చర్చించారు. సహజంగా ఇటువంటి పరిణామాలను మేధావులు స్వాగతించాలి. ఇటువంటి వాటి వల్ల జరిగే వృద్ధిని ముందుగానే అంచనా వేసి ప్రజలకు చెప్పగలగాలి. కానీ ఏపీలో కొంతమంది మేధావులు ఇలా వ్యవహరించడం లేదు. పైగా అభివృద్ధిలోనూ రాజకీయాన్ని చూస్తున్నారు.. అందువల్లే ఏపీ ప్రజలు కొంతమంది మేధావులను ఈసడించుకుంటున్నారు.
ఏపీలో గూగుల్ సెంటర్ ఏర్పాటు తర్వాత కొంతమంది మేధావులు కోడిగుడ్డు మీద ఈకలు పీకడం మొదలుపెట్టారు. గూగుల్ వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందని.. విశాఖపట్నం నాశనమవుతుందని.. ఇంకా అనేక రకాల ప్రకృతి విపత్తులు చోటు చేసుకుంటారని అంకమ్మ శోకాలు పెడుతున్నారు. వైసిపి కోణంలో మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్ పై అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారు. జగన్ మెప్పు పొందడానికి.. జగన్ మీడియాలో ప్రచారం పొందడానికి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు.
వాస్తవానికి వైసీపీ కి అనుబంధంగా పనిచేస్తున్న సాక్షి మీడియా డిజిటల్ ప్రసారాలను చేస్తోందంటే దానికి ప్రధాన కారణం ఉపగ్రహాల వల్ల. టెక్నాలజీ వల్లే ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి. ఆ టెక్నాలజీ అభివృద్ధి చేయడానికి ఎన్నో విధాలుగా వనరులను ఉపయోగించారు. అక్కడిదాకా ఎందుకు సాక్షి టీవీలో కూర్చొని డిబేట్లు పెట్టే వారంతా ఉపయోగించే ఫోన్లు, కార్లు, ఇతర ఉపకరణాలు మొత్తం పర్యావరణానికి విధ్వంసం చేయడం వల్లనే ఉత్పత్తి అయ్యాయి. ఇప్పుడు గూగుల్ సెంటర్ మీద అడ్డగోలుగా విమర్శలు చేస్తున్న వారంతా ఆ ఉపకరణాలను వాడకుండా ఉండాలి. అలా వాడకుండా ఉండగలరా? గూగుల్ డేటా సెంటర్ లో పర్యావరణ ప్రతికూలతలు ఎంతో కొంత ఉండవచ్చు. కానీ దానినే భూతద్దంలో పెట్టి చూడడం అత్యంత దారుణం.
గూగుల్ డేటా సెంటర్ పూర్తిగా గ్రీన్ ఎనర్జీని వాడుతుంది. అంటే సోలార్ ద్వారా ఉత్పత్తి కరెంటును మాత్రమే ఉపయోగిస్తారు. పోలవరం ద్వారా వచ్చే నీటిని గూగుల్ డేటా సెంటర్ ఉపయోగించుకుంటుంది. అప్పుడు విశాఖపట్నం మీద కూడా ఒత్తిడి పడదు. కేవలం ఇక్కడ డాటా ఆధారిత కార్యకలాపాలు మాత్రమే సాగుతాయి. అలాంటప్పుడు పర్యావరణాన్ని కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ విషయాలను గుర్తించకుండా.. ప్రపంచంలో ఎక్కడో ఏదో జరిగితే.. విశాఖపట్నంలో కూడా అలానే జరుగుతుందని మేధావులు చెప్పడం వారి బుద్ధిహీనతకు నిదర్శనమని ఏపీ ప్రజలు అంటున్నారు.