AP Government: ఏపీలో బీసీల పార్టీ అంటే ముందుగా గుర్తుకొచ్చేది తెలుగుదేశం.టిడిపి ఆవిర్భావం నుంచి బీసీలు ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు.2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ వైపు టర్న్ అయ్యారు. కానీ గత ఐదేళ్లుగా బీసీలకు ప్రత్యేక పథకాలు, రాయితీలు లేకపోవడంతో పునరాలోచనలో పడ్డారు బీసీలు. అందుకే ఈ ఎన్నికల్లో కూటమికి మద్దతు తెలిపారు.కూటమి ఏకపక్ష విజయానికి కారణం అయ్యారు.అందుకే ఇప్పుడు బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు.పెద్ద ఎత్తున స్వయం ఉపాధి పథకాలు అమలు చేయాలని చూస్తున్నారు.ఇందుకు సంబంధించి ప్రణాళిక రూపొందించారు.బీసీ అధికారులు ఇప్పటికే పలు పథకాలకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు.సీఎం చంద్రబాబు నుంచి అనుమతి రాగానే పథకాలు అమలు చేయాలని భావిస్తున్నారు.ప్రధానంగా బీసీ మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణతో పాటు యువతతో జనరిక్ మందుల షాపుల ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. ఇది బీసీలకు శుభపరిణామమే. ఆ వర్గాలలో ఉద్యోగాలతో పాటు ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయి.
* 80 వేల మందికి శిక్షణ
టిడిపి ప్రభుత్వ హయాంలోనే బీసీలకు పెద్ద ఎత్తున పథకాలు అమలయ్యేవి. మరోసారి ఆ పరిస్థితి తేవాలని చంద్రబాబు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 80 వేల మంది బీసీ మహిళలకు శిక్షణ ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలతో పాటు పట్టణాలు, మండల కేంద్రాల్లో జనరిక్ మందుల షాపులను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈ మేరకు ఈ స్వయం ఉపాధి పథకాలకు సంబంధించిన రుణాలు, దరఖాస్తుల కోసం ఆన్లైన్లో ఓబి ఎంఎస్ వెబ్ సైట్ ను కూడా సిద్ధం చేస్తున్నారు అధికారులు.మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇచ్చేందుకు పలు సంస్థలను ఆహ్వానిస్తూ టెండర్లను కూడా పిలిచినట్లు తెలుస్తోంది. రోజులో నాలుగు గంటలపాటు టైలరింగ్ లో శిక్షణ ఇవ్వనున్నారు. 90 రోజులపాటు ఈ శిక్షణ కొనసాగునుంది.ఈ మేరకు త్వరలో శిక్షణ కేంద్రాలను కూడా ప్రారంభించనున్నారు.శిక్షణ పొందిన మహిళలకు 24 వేల రూపాయల విలువచేసి కుట్టుమిషన్లు కూడా అందించనున్నారు. ఈ శిక్షణకు సంబంధించి నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఇప్పటికే ఒప్పందం కూడా చేసుకున్నారు అధికారులు.
* జనరిక్ మందుల షాపుల ఏర్పాటు
ప్రస్తుతం జనరిక్ మందులు కొరత కొనసాగుతోంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా జనరిక్ మందుల షాపులు అందుబాటులో తేవాలని చూస్తోంది ప్రభుత్వం. మందుల డిమాండ్ ఉన్నచోట ఏర్పాటు చేస్తే యువతకు స్వయం ఉపాధి కల్పించినట్లు అవుతుంది. ఈ మేరకు బీసీ యువతలో డి ఫార్మా, బి ఫార్మసీ పూర్తి చేసిన వారికి ప్రోత్సహించి ఉపాధి కల్పించనున్నారు. ఒక్కో జనరిక్ మందుల షాపు అభివృద్ధికి సంబంధించి ఎనిమిది లక్షల రూపాయలను బీసీ సంక్షేమ ఆర్థిక సంస్థ అందించనుంది.ఇందులో నాలుగు లక్షల రూపాయలు సబ్సిడీ, మరో నాలుగు లక్షల రూపాయలు రుణంగా అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ స్వయం ఉపాధి పథకాలకు సంబంధించిపూర్తి సంసిద్ధతగా ఉంది బీసీ కార్పొరేషన్.ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే పథకాలను గాడిలో పెట్టనుంది.వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.