King George Hospital: ఉత్తరాంధ్రకు( North Andhra) పెద్ద ఆసుపత్రి విశాఖ కేజీహెచ్. కేవలం ఉత్తరాంధ్రలోని జిల్లాలే కాకుండా ఒడిస్సా, చత్తీస్గడ్ నుంచి కూడా రోగులు వస్తుంటారు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఈ పెద్ద ఆస్పత్రి ఒక వరమే. అటువంటి పెద్ద ఆసుపత్రి బలోపేతానికి దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. పెద్ద ఎత్తున సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో విస్తరిస్తున్న క్యాన్సర్ భూతాన్ని తరిమి కొట్టేందుకు వీలుగా.. రేడియో థెరపీ విభాగంలో అత్యాధునిక వైద్య పరికరాలతో సేవలు ప్రారంభమయ్యాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందిస్తున్న ఈ క్యాన్సర్ సేవల కోసం.. ఇకనుంచి లక్షల రూపాయలు ఖర్చు చేయనవసరం లేదు. అందుకు సంబంధించిన అన్ని అత్యాధునిక పరికరాలు కేజీహెచ్ లో అందుబాటులోకి వచ్చాయి. ఉచితంగానే వైద్యం అందనుంది.
రూ.40 కోట్ల విలువైన పరికరాలు..
ఏపీ ప్రభుత్వం( AP government ) విశాఖ కేజీహెచ్ కు రూ.40 కోట్ల విలువ చేసే మూడు కీలక వైద్య పరికరాలను అందించింది. కేజీహెచ్ కు వచ్చే రోగులతో పాటుగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద వచ్చే రోగులకు వైద్యం అందిస్తారు. ఇప్పటివరకు ఉత్తరాంధ్రతో పాటు ఒడిస్సా కు చెందిన రోగులు ఎక్కువగా ఆశ్రయించే వారు కేజీహెచ్ కు. కీలకమైన రేడియో థెరపీ సేవలు అందుబాటులో ఉన్నా.. అత్యాధునిక పరికరాలు లేకపోవడంతో వైద్య సేవలకు ఇబ్బంది కలిగేది. అందుకే ఈ కొత్త పరికరాలను అందించింది ఏపీ ప్రభుత్వం. సుమారు 40 కోట్ల రూపాయల విలువైన పరికరాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఇకనుంచి శరీరంలో ఏ భాగానికి క్యాన్సర్ వచ్చినా నయం చేయవచ్చు ఇక్కడ.
సరికొత్త పరికరాలతో..
విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో( Visakha king George Hospital ) క్యాన్సర్ వైద్యం అందుతూ వస్తోంది. ఇప్పటివరకు టెలి కోబాల్ట్ యంత్రంతో రేడియేషన్ చికిత్స చేసేవారు. వాటి స్థానంలో ఇప్పుడు కొత్త యంత్రాలు వచ్చాయి. అంతేకాకుండా రేడియో తెరపి విభాగంలో చికిత్స తో పాటు పీజీ కోర్సులు కూడా బోధిస్తారు. ఈ విభాగంలో ప్రస్తుతం ఏడుగురు పీజీ విద్యార్థులు ఉన్నారు. ఒక ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇద్దరు సహాయ ప్రొఫెసర్లు ఉన్నారు. బ్రోకోతెరపి యూనిట్ ద్వారా ఐసిఆర్, ఐఎల్ఆర్ టి, ఐఎస్బిటి, మెల్ట్ థెరపీ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ సేవలు ఇంట్రాకేవిటీ రేడియేషన్, ఇంట్రా లూమినల్ రేడియో థెరపీ, ఇంటర్ స్టీటీయల్ బ్రాంచ్ థెరపీ వంటి చికిత్సలు అందిస్తాయి. మొత్తానికి అయితే ఉత్తరాంధ్ర పెద్దాసుపత్రిలో క్యాన్సర్ సేవలు మెరుగుపడుతుండడం విశేషం.