Good news for farmers: ఏపీలో రైతులకు గుడ్ న్యూస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి శుభవార్త వచ్చింది. పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ రెండు పథకాలకు సంబంధించిన నిధులు రైతుల ఖాతాల్లో ఒకే సమయంలో జమ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ తో మూడు విడతలుగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి సంక్రాంతికి ముందు 22వ విడత పిఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారని అంతా భావించారు. అలా చేయకపోయేసరికి రైతులు నిరాశకు గురయ్యారు. ఇటువంటి నేపథ్యంలో 2 పథకాల కు నిధులు జమ చేసేందుకు ఇప్పుడు ముహూర్తం ఖరారు చేశారు. ఏపీ ప్రభుత్వం సైతం నిధుల విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కు కసరత్తు మొదలుపెట్టింది. మూడు విడతల్లో ప్రతి సంవత్సరం పిఎం కిసాన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబర్ 19న 21వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. ఏపీ ప్రభుత్వం అదేరోజు అన్నదాత సుఖీభవ నిధులను సైతం విడుదల చేసింది. ఎప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకం ద్వారా 14 వేల రూపాయలను అందించాయి. చివరి విడతగా మరో ఆరువేల రూపాయలను విడుదల చేయనున్నాయి. అందుకు సంబంధించి ముహూర్తం ఫిక్స్ చేసాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.
పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. ఫిబ్రవరి 14న ఈ నిధులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. పిఎం కిసాన్ ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. ఇప్పటివరకు 21 విడతల్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలను రైతులకు అందించింది కేంద్రం. అయితే కేంద్ర ప్రభుత్వంతో కలిసి రైతులకు సాగు సాయం కింద 20,000 అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే గత రెండు విడతల్లో కేంద్రంతో కలిసి 7000 చొప్పున 14 వేల రూపాయలను అందించారు. ఇప్పుడు చివరి విడతగా కేంద్ర ప్రభుత్వం అందించే 2000 రూపాయలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు జమ చేయనుంది. తద్వారా రైతులకు అందిస్తామన్న 20వేల రూపాయల సాయం రైతులు అందుకున్నట్టే.