Amaravati Capital: అమరావతి రాజధాని నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. అమరావతి పై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచి అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన నాటికి అమరావతికి కొత్త కళ వచ్చింది. ప్రాథమికంగా జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తయ్యాయి. ప్రధాన రహదారులలో విద్యుత్ లైట్లు వెలిగి కొత్త కళ సంతరించుకుంది. అదే సమయంలో సీఎం చంద్రబాబు విన్నపం మేరకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. అయితే ఇది రుణమా? గ్రాంటా? అన్న విషయంలో కొంత వివాదం నెలకొంది. అయితే ప్రపంచ బ్యాంకు నిధులను తామే సర్దుబాటు చేసినట్లు కేంద్రం ప్రకటించింది. దీనికి తామే గ్యారెంటీ అని కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పావులు కాదపడం ప్రారంభించారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందాన్ని అమరావతికి రప్పించారు. వారి ముందు కీలక ప్రతిపాదనలు పెట్టారు. సిఆర్డిఏ బృందం రూపొందించిన ఒక ప్రత్యేక ప్రణాళికను, వ్యూహాన్ని ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల ఎదుట పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు బృందం అమరావతిలో విస్తృతంగా పర్యటిస్తోంది. రాజధాని పరిధిలో కట్టడాలు, ఇతర నిర్మాణాలు, ప్రస్తుత స్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తోంది. ఈ సందర్భంగా అమరావతికి కావాల్సిన రుణంపై కూడా చర్చలు కొనసాగించినట్లు తెలుస్తోంది.
* నవ నగరాలే లక్ష్యం
అమరావతిలో నవ నగరాలు నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దాదాపు 33 వేల ఎకరాలను రైతుల నుంచి సమీకరించగా.. మరో 21 వేల ఎకరాలు ప్రభుత్వ భూమిని కలుపుకొని.. 54 వేల ఎకరాల్లో అమరావతిని ప్రపంచానికే తలమానికంగా కట్టాలన్నది ప్లాన్. అయితే గత ఐదేళ్ల వైసిపి పాలనలో అమరావతి రాజధాని నిర్వీర్యం అయ్యింది. దానిని యధాస్థితికి తెచ్చి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.
* ఐఐటీ నిపుణుల పరిశీలన
బెంగళూరు తో పాటు హైదరాబాద్ ఐఐటి నిపుణులు ఇటీవల అమరావతి నిర్మాణాలను పరిశీలించారు. ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఇంకోవైపు అమరావతిలోని 54 వేల ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులకు గాను 36 వేల కోట్లతో టెండర్లు పూర్తయ్యాయి. పనులు కూడా ప్రారంభమయ్యాయి. 45 రోజుల్లో అమరావతిని యధాస్థానానికి తీసుకొచ్చేందుకు లక్ష్యంగా ఈ పనులు జరుగుతున్నాయి. ఇంతలో ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్రం సర్దుబాటు చేసిన 15 వేల కోట్లతో పాటు కొంత మొత్తం రుణం పొందాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది.
* 2050 అంచనాలకు అనుగుణంగా
2050 నాటికి అమరావతి రాజధాని రూపును అంచనా వేసుకుని.. అవసరాలకు తగ్గట్టు నిర్మాణాలు చేపట్టాలని సిఆర్డిఏ భావిస్తోంది. అందుకు అవసరమైన కీలక ప్రాజెక్టులను ప్రపంచ బ్యాంకు ఎదుట పెట్టింది. వాటికి సాయం చేయాలని అడిగింది. ముఖ్యంగా రోడ్లు, యుటిలిటీ కారిడార్లు, సీనరేజ్, విలేజ్ రోడ్లు, కనెక్టివిటీ, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరద ముంపు నివారణ కాలువల మెరుగుదల.. వంటి వాటికి నిధులు ఇవ్వాలని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను కోరారు. కనీసం 40 వేలకోట్ల అవసరం ఉందని అంచనా వేస్తూ ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల ఎదుట ప్రతిపాదనలు ఉంచారు సిఆర్డిఏ అధికారులు. దీనికి ప్రపంచ బ్యాంకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.