Ganta Srinivasa Rao: తెలుగుదేశం( Telugu Desam) పార్టీలో చాలామంది సీనియర్లకు అవకాశాలు దక్కలేదు. ముఖ్యంగా మంత్రి పదవులపై చాలామంది ఆశలు పెట్టుకున్నారు. కానీ వారికి ఎటువంటి అవకాశాలు ఇవ్వలేకపోయారు చంద్రబాబు. మూడు పార్టీల మధ్య పొత్తు కుదరడంతో పదవులను సర్దుబాటు చేయాల్సి వచ్చింది. యువతకు ప్రాధాన్యం ఇవ్వాల్సి రావడంతో సీనియర్లకు అవకాశం దక్కలేదు. అటువంటి వారికి ఏదో రూపంలో సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పటికీ సీనియర్లు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ప్రత్యామ్నాయ పదవులను ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న సీనియర్లు అయ్యన్నపాత్రుడు, రఘురామకృష్ణం రాజులకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు గంటా శ్రీనివాసరావుకు క్యాబినెట్ ర్యాంకుతో కూడిన పదవి ఇస్తారని ప్రచారం నడుస్తోంది.
* కీలకంగా మారడంతో..
ప్రస్తుతం విశాఖకు( Visakhapatnam) పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖ ఏర్పాటు కానుంది. మరోవైపు ఐటీ పరిశ్రమలు భీమిలి నియోజకవర్గం పరిధిలోనే ఏర్పాటు అవుతున్నాయి. భీమిలి నియోజకవర్గం చెంతనే భోగాపురం ఉంది. అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు అవుతోంది. దీంతో పర్యాటక ప్రాజెక్టులు సైతం రానున్నాయి. రాష్ట్రంలోనే కీలక నియోజకవర్గంగా భీమిలి మారనుంది.
* సమస్యకు పరిష్కారం..
సాధారణంగా పరిశ్రమలు వస్తే భూములు కేటాయిస్తారు. భూములను సమీకరించి పరిశ్రమలకు అప్పగించాల్సి ఉంటుంది. గూగుల్ డేటా సెంటర్( Google data centre) విషయంలో సైతం ఇటువంటి భూ సమస్యలే వచ్చాయి. భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకారం తెలపలేదు. దీంతో రంగంలోకి దిగారు గంటా శ్రీనివాసరావు. వారితో చర్చలు జరిపి పరిష్కార మార్గం చూపించారు. చంద్రబాబుతో పాటు లోకేష్ ఈ విషయంలో అభినందనలు తెలిపారు. అందుకే గంటా శ్రీనివాసరావు సేవలను వినియోగించుకోవాలన్న ఆలోచనకు వచ్చారు.
* ఆ జిల్లాలను కలుపుతూ..
రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఉంచాలని చంద్రబాబు( CM Chandrababu) భావిస్తున్నారు. అందుకు పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రాయలసీమలో తయారీ రంగ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. ఉత్తరాంధ్రకు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వస్తున్నాయి. వీటికి తోడు పర్యాటక ప్రాజెక్టులు రాక ప్రారంభం అయింది. అందుకే వాటికి భూ సమస్య రాకుండా.. ప్రత్యేక బాధ్యతలను గంటా శ్రీనివాసరావుకు కట్టబెట్టనున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి జిల్లాలను చేర్చుతూ ఒక ప్రత్యేక ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు. దానికి చైర్మన్ గా గంటా శ్రీనివాసరావును నియమిస్తారని తెలుస్తోంది. క్యాబినెట్ హోదాతో కూడిన పదవి కావడంతో గంటా శ్రీనివాసరావుకు తగిన గౌరవం దక్కుతుందని భావిస్తున్నట్లు సమాచారం. అతి త్వరలో ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
