Ganta Srinivasa Rao quits politics: తెలుగుదేశం( Telugu Desam) పార్టీలో చాలామంది నేతలు వచ్చే ఎన్నికల నాటికి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారు. ఇక ఈ పొలిటికల్ జర్నీ చాలు ప్రశాంతంగా ఉంటాం అని భావిస్తున్న వారు ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లోనే చాలామంది క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. అవకాశం ఉన్నవారు వారసులను బరిలోదించారు. కొందర్ని పార్టీ తప్పించింది. మరికొందరు స్వచ్ఛందంగా తప్పుకున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఇలా తప్పుకునే వారి జాబితా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు చాలామంది సీనియర్లు క్రియాశీలక రాజకీయాలకు దూరం అవుతారని సమాచారం. ప్రముఖంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాను తప్పుకుంటానని.. తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది. లోకేష్ ను సైతం కోరగా ఆయన సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
మంత్రి పదవి దక్కలేదు..
గత ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు( Ganta Srinivasa Rao) భీమిలి నుంచి గెలిచారు. చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవి ఆశించారు. కానీ వివిధ సమీకరణల్లో ఆయనకు దక్కలేదు. అయితే పొలిటికల్ గా యాక్టివ్గానే ఉన్నారు. కానీ భీమిలి నియోజకవర్గంలో మాత్రం ఆయన కుమారుడు గంటా రవితేజ అన్ని తానై వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు ఇప్పటినుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గంటా శ్రీనివాసరావు తప్పుకొని కుమారుడికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగి ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా వ్యవహరించారు గంటా శ్రీనివాసరావు. అయితే సుదీర్ఘకాలం మాత్రం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. తన రాజకీయ వారసుడిగా కుమారుడిని తెచ్చి యాక్టివ్ పాలిటిక్స్ నుండి దూరం కావాలన్నది గంటా శ్రీనివాసరావు ఆలోచనగా తెలుస్తోంది.
ఒక్కసారి ఓటమిలే..
తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు గంటా శ్రీనివాసరావు. ఇంతవరకు ఆయనకు ఓటమి ఎదురు కాలేదు. తొలిసారిగా 1999లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. పార్లమెంట్లో అడుగుపెట్టి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వగలిగారు. 2004లో తొలిసారిగా చోడవరం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి. 2009లో మాత్రం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అనకాపల్లి నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత గంటా శ్రీనివాసరావుకు ఏపీ క్యాబినెట్లో చోటు దక్కింది. 2014లో తెలుగుదేశం పార్టీలో చేరిన గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా భీమిలి నుంచి బరిలో దిగారు. మంత్రి పదవి ఆశించారు కానీ దక్కలేదు. అయితే తన బదులు తన కుమారుడు గంటా రవితేజకు వచ్చే ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారు. అధినేత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఒకవైపు.. యువనేత లోకేష్ ఆశీస్సులు ఉండడంతో గంటా రవితేజ బరిలో దిగడం ఖాయమని తెలుస్తోంది.