Lucky Bhaskar Movie Impact : సినిమాలకు చిన్న పిల్లలు బాగా ప్రభావితం అవుతుంటారని అందరూ అంటుంటారు. ఎంతలా ప్రభావితం అవుతారో, ఇటీవల వైజాగ్ లో జరిగిన ఒక సంఘటన ఉదాహరణగా నిల్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మన తెలుగులో ‘లక్కీ భాస్కర్’ అనే చిత్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఒక సామాన్య బ్యాంక్ ఉద్యోగి, కోట్ల రూపాయిలు సంపాదించే దిశగా ఎదిగిన తీరుని డైరెక్టర్ వెంకీ అట్లూరి అద్భుతంగా చూపించారు. అలా ఎదగడం వల్ల వచ్చే సమస్యలను కూడా చూపించాడు. అయితే ఈ సినిమాని చూసి బాగా ప్రభావితమైన నలుగురు విద్యార్థులు వైజాగ్ లోని మహారాణిపేట లోని ఒక స్కూల్ హాస్టల్ నుండి పరారయ్యారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారింది.
సెయింట్ ఆన్స్ హై స్కూల్ లో 9 వ తరగతి చదువుతున్న కిరణ్ కుమార్, కార్తీక్, చరణ్ తేజ, రఘు అనే నలుగురు విద్యార్థులు, తమ స్నేహితులతో లక్కీ భాస్కర్ చిత్రంలోని హీరో లాగా ఇల్లు, కార్లు సంపాదించి తిరిగొస్తామని సవాలు చేసి హాస్టల్ గోడ దూకి పారిపోయారట. దీనికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఫిర్యాదుని స్వీకరించిన పోలీసులు, విద్యార్థుల కోసం వెతుకుతున్నారు. అందులో భాగంగా బస్సు , రైల్వే స్టేషన్ లోని సీసీటీవీ ఫుటేజీ ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే విద్యార్థుల ఆచూకీ దొరకలేదు. మరోపక్క తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం పై మండిపడుతూ ఆరోపిస్తున్నారు. విద్యార్థులు ఎటు వెళ్తున్నారు, ఏమి చేస్తున్నారు అనేది చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యం దే కదా, మా పిల్లలు తప్పిపోవడానికి కారణం స్కూల్ యాజమాన్యమే అని, వాళ్ళు దొరక్కపోతే స్కూల్ యాజమాన్యం మీద కూడా కేసు వేస్తామని హెచ్చరించారు.
‘లక్కీ భాస్కర్’ చిత్రం లో దొంగదారిలో డబ్బులు ఎలా సంపాదించాలో చూపించిన డైరెక్టర్, ఆ దారిలో వెళ్లడం వల్ల హీరోకి ఎదురైనా ఇక్కట్లను కూడా చూపిస్తారు. ఈ విద్యార్థులు సినిమాలో చూపించిన మంచిని తీసుకోకుండా, చెడుని తీసుకున్నారు. సినిమాలోని నీతిని పూర్తిగా గాలికి వదిలేశారు. అలాంటప్పుడు ఇలాంటి సినిమాలను ఎలా తీశారు అని డైరెక్టర్, హీరోని ఎలా నిందించగలరు?, వాళ్ళు ఈ సినిమా చూసి మారిపోండి అని చెప్పలేదు కదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జనాలు మంచికంటే చెడుకే ఎక్కువగా ఆకర్షిస్తులు అవుతారని, ముఖ్యంగా తెలిసీతెలియని వయస్సులో ఉండే విద్యార్థులు ఇంకా ఎక్కువ ప్రభావితం అవుతారు అనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిల్చింది. ఆ పిల్లలకు ఎలాంటి హాని కలగకుండా, తల్లిదండ్రుల దగ్గరకు చేరాలని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ప్రార్థిస్తున్నారు.
BREAKING – Four 9th-grade students from St. Ann’s High School, Visakhapatnam, escaped their hostel after watching @dulQuer‘s #LuckyBaskhar, they told their friends they would return after earning money to buy cars and houses, inspired by #DulquerSalmaan‘s character in the film pic.twitter.com/X4iUa6bjc9
— Daily Culture (@DailyCultureYT) December 10, 2024