Killi Krupa Rani: కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి వైసీపీని వీడనున్నారు. గత కొంతకాలంగా ఆమె వైసీపీ పై అసంతృప్తిగా ఉన్నారు. గత ఎన్నికలకు ముందు ఆమె వైసీపీలో చేరారు. పార్టీ అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. కానీ గత ఐదేళ్లలో ఆమెకు పదవులు దక్కలేదు. వైసిపి జిల్లా అధ్యక్షురాలి పదవి ఇచ్చి తొలగించారు. రాజ్యసభ ఇస్తున్నట్లు లీకులిచ్చి తర్వాత పేరు లేకుండా చేశారు.శ్రీకాకుళం జిల్లాలో సైతం ఆమెకు ప్రాధాన్యత లేకుండా పోయింది. ఎన్నికల్లో ఎంపీగానో, ఎమ్మెల్యే గానో పోటీ చేసేందుకు ఛాన్స్ ఇస్తారని భావించారు. కానీ కనీస పరిగణలోకి తీసుకోకపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. పార్టీని వీడేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి పిలుపుమేరకు 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరారు కృపారాణి. ఆ ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. టిడిపి నేత కింజరాపు ఎర్రం నాయుడు కు గట్టి పోటీ ఇచ్చారు. 2009లో మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి ఎర్రం నాయుడు ను ఓడించారు. జైంట్ కిల్లర్ గా నిలిచారు. యూపీఏ 2 ప్రభుత్వంలో కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పదవి పొందారు. 2014 ఎన్నికల సమయంలోనే వైసీపీ నుంచి ఆహ్వానం ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆమె కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు ఆమె వైసీపీలో చేరారు. అప్పటికే అభ్యర్థులు ఖరారు కావడంతో ఆమెకు సీటు లేకుండా పోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఇంతలో వైసిపి జిల్లా అధ్యక్షురాలు పదవి ఇచ్చారు. కానీ పనితీరు బాగాలేదని చెప్పి ఆమెను తప్పించారు. ధర్మాన సోదరులలో ఒకరైన కృష్ణదాస్ కు ఆ బాధ్యతలు అప్పగించారు.
ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ సీటు తో పాటు శ్రీకాకుళం పార్లమెంట్ స్థానాన్ని ఆశించారు. కానీ ఆ రెండు చోట్ల కృపారాణికి చాన్స్ లేకుండా పోయింది. అందుకే గత కొద్దిరోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. టిడిపిలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ ఆ పార్టీలోకి వెళ్లినా.. ఎక్కడా టిక్కెట్ దక్కే అవకాశాలు లేవు. అందుకే ఆమె పూర్వశ్రమమైన కాంగ్రెస్ పార్టీలో చేరాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పెద్దలను కలిసి చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె తొందరలోనే కాంగ్రెస్ లో చేరడం ఖాయమని తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి శ్రీకాకుళం ఎంపీ స్థానానికి తాను కానీ.. తన కుమారుడు విక్రాంత్ కానీ పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఆమె ఎట్టి పరిస్థితుల్లో వైసీపీలో కొనసాగడానికి విముఖత చూపుతున్నారు. ఆమె వైసీపీని వీడితే శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.