Deve Gowda: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగుతోంది. అదే సమయంలో కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. అందుకే మూడు పార్టీలు పరస్పర రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పదవుల పంపకాల విషయంలో కూడా సహకారంతో ముందుకు సాగుతున్నాయి. అయితే నామినేటెడ్ పదవులకు సంబంధించి.. రాష్ట్రస్థాయి పదవుల విషయంలో బిజెపి పెద్దగా పట్టు పట్టడం లేదు. కానీ రాజ్యసభ పదవుల విషయంలో మాత్రం బిజెపి సింహభాగం ప్రయోజనాలను కోరుతోంది. అందుకు తగ్గట్టుగానే రెండు రాజ్యసభ పదవులను ఆ పార్టీ సొంతం చేసుకుంది. అయితే వచ్చే ఏడాది ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ పదవులపై సైతం బిజెపి కన్నేసినట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఏపీ నుంచి భర్తీ అయ్యే రాజ్యసభ పదవుల్లో.. సగానికి పైగా ఆ పార్టీ సొంతమైనట్టే.
Also Read: ‘హరి హర వీరమల్లు’ ఓవర్సీస్ అభిమానులకు చేదువార్త..డిస్ట్రిబ్యూటర్ సంచలన ప్రకటన!
* దేశవ్యాప్తంగా భారీగా ఖాళీలు..
వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా 72 రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఆ స్థానాల్లో ఉన్న నేతల పదవీకాలం ముగియడంతో ఎన్నికలు అనివార్యం కానున్నాయి. పదవీ విరమణ చేస్తున్న వారిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే( Mallikarjun Kharge ), మాజీ ప్రధాని దేవే గౌడ, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, కేంద్రమంత్రి జార్జ్ కురియన్, కేంద్రమంత్రి రావునిత్ సింగ్ బిట్టు, జే ఎం ఎం వ్యవస్థాపకుడు శిబూ సురేన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పరిమళనత్వాని, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, టిడిపి ఎంపీ సానా సతీష్ ఉన్నారు.
* దేవె గౌడకు ఛాన్స్
ప్రధానంగా ఏపీ నుంచి నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో ఒక స్థానాన్ని మాజీ ప్రధాని దేవె గౌడకు( Deve Gowda ) కేటాయించాల్సి ఉంటుందని చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఎన్డీఏలో జెడిఎస్ భాగస్వామ్య పక్షంగా ఉంది. అందుకే ఆ పార్టీకి ఏపీ నుంచి అవకాశం ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఆపై దేవె గౌడతో ఏపీ సీఎం చంద్రబాబుకు మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో దేవె గౌడను ప్రధానిని చేసింది చంద్రబాబు. ఆపై ఆయన కుమారుడు కుమారస్వామి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన సైతం చంద్రబాబుతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా చంద్రబాబు సైతం దేవె గౌడ కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.
* మూడు పార్టీలకు సమానంగా..
అయితే నాలుగు రాజ్యసభ పదవులకు గాను.. ఒక స్థానాన్ని మాజీ ప్రధానికి కేటాయించి.. మిగతా మూడు రాజ్యసభ పదవులను మూడు పార్టీలు సమానంగా పంచుకుంటాయని తెలుస్తోంది. అదే జరిగితే బిజెపి నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి( nallari Kiran Kumar Reddy), టిడిపి నుంచి మరోసారి సతీష్, జనసేన నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కు ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. అయితే ఇంకా దీనికి సమయం ఉంది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు మారే అవకాశాలు కూడా ఉన్నాయి. చూడాలి ఏం జరుగుతుందో.