Chinta Mohan : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించింది. బుధవారం(జనవరి 8 మధ్యాహ్నం) టోకెన్లు జారీ చేస్తామని తెలుపడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తిరుపతిలో టికెట్ కౌంటర్లు ఇచ్చే ప్రాంతానికి చేరుకున్నారు. ఉదయం ఇస్తామన్న టికెట్లు రాత్రి 7 గంటల వరకు జారీ చేయలేదు. దీంతో అప్పటికే అక్కడికి వచ్చిన భక్తులు టీటీడీ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో రాత్రి 7:30 గంటల సమయంలో టోకెన్ల జారీ చేస్తారని తెలియగా, పోలీసులు ఒక్కసారిగా అక్కడ గేట్లు తెరిచారు. దీంతో అందరూ తోసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో భక్తులు కిందపడిపోవడం, తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. 50 మందికిపైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల భక్తులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయకడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రతిపక్ష నేత జగన్ తిరుపతిలో ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారితో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఘటనకు క్షమాపణ చెప్పారు. సీఎం ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. మరో ముగ్గురిపై బదిలీ వేటు వేశారు. ఈ ఘటనపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, టీటీడీ వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. ఇలా ఘటనపై అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు.
వాళ్లే పడిపోయారట..
అందరూ తిరుపతి ఘటనపై ఆందోళన, బాధ వ్యక్తం చేస్తున్నారు. ఎంత ఘోరం జరిగిందని భక్తులు బాధపడుతున్నారు. ఇలాంటి ఘటన జరుగకుండా చూడాలని కోరుతున్నారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. కానీ, ఆయన స్పందన అందరికీ కోపం తెప్పించేలా ఉంది.న ఆరుగురు భక్తులు చనిపోయినందుకు కనీసం విచారం వ్యక్తం చేయకపోగా.. ఇందులో టీటీడీ తప్పులేదని వెనకేసుకొచ్చాడు. టీటీడీ చాలా బాగా పనిచేస్తుందని కితాబు ఇచ్చాడు. గతంకన్నా మెరుగైందని పేర్కొన్నాడు.
వాళ్లే పడిపోయారట..
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్(Tokens)జారీ కేంద్రాల వద్ద జరిగిన ఘటనల్లో భక్తులు మృతిచెందడానికి చింతా మోహన్ విచిత్రమైన కారణం చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు.. టోకెన్ చారీ కేంద్రాల వద్ద ఉదయం నుంచి వేచి ఉండడం కారణంగా సరిగా భోజనం చేయకపోవడం, టిఫిన్లు కూడా చేయకపోవంతో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గిపోయి భక్తులు వారంతట వారే కిందపడిపోయారట. భక్తులను ఎవరూ తోసేయలేదని, అసలక్కడ తోపులాటే జరగలేదని వ్యాఖ్యానించారు. దీనికి టీటీడీ(TTD) ఈవో శ్యామలరావుగానీ, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి గానీ, పోలీసులకు గానీ ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
మండి పడుతున్న భక్తులు..
చింతా మోహన్ వ్యాఖ్యలపై భక్తులు మండిపడుతున్నారు. ఆయనది నోరా.. మోరా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఏం జరిగిందో సీసీకెమెరాల్లో దృశ్యాలు రికార్డు అయ్యాయని పేర్కొంటున్నారు. ప్రాథమిక సమాచారం కూడా తెలుసుకోకుండా ఓ మాజీ ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడుతున్నారు. మృతుల బంధువులు అయితే మాజీ ఎంపీ తీరును తప్పు పడుతున్నారు. ఇంత దిగజారి మాట్లాడడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నేత రాజకీయాల్లో ఉండడం ఎందుకని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.