YCP: వైసీపీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెబుతున్నారు. తాజాగా ఇద్దరు తాజా మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా ప్రకటించారు. ఇద్దరూ జగన్ కు అత్యంత సన్నిహితులే. జగన్ పిలుపుమేరకు వేరే పార్టీ నుంచి వచ్చిన వారే. వైసిపి ఓడిపోవడంతో నేతలు పెద్ద ఎత్తున ఆ పార్టీని వీడుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండో రోజే విజయవాడ ఎంపీగా పోటీ చేసిన కేసినేని నాని ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. అప్పటినుంచి వారు వీరు అన్న తేడా లేకుండా చాలామంది నేతలు పార్టీని వీడుతున్నారు. ఎమ్మెల్సీలతో పాటు రాజ్యసభ సభ్యులు సైతం తమ పదవులకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. ఎమ్మెల్సీలుగా ఉన్న బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పోతుల సునీత, కర్రీ పద్మశ్రీ, జయ మంగళం వెంకట్ రమణ రాజీనామా ప్రకటించారు. వారి రాజీనామా ఇంకా పెండింగ్లో ఉంచారు మండలి చైర్మన్. ఇంకోవైపు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు రాజీనామా చేశారు. మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆళ్ల నాని వంటి వారు గుడ్ బై చెప్పారు. ఇప్పుడు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రావు తో పాటు మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సైతం రాజీనామా ప్రకటించారు.
* 2009లో పొలిటికల్ ఎంట్రీ
2009లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అవంతి శ్రీనివాసరావు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ 2014 ఎన్నికల్లో మాత్రం టిడిపిలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీలో చేరారు. భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. మూడేళ్ల పాటు మంత్రి అయ్యారు. ఈ ఎన్నికల్లో మరోసారి వైసీపీ అభ్యర్థిగా భీమిలి నుంచి పోటీ చేసిన అవంతి శ్రీనివాస్ రావు కు షాక్ తప్పలేదు. ఓటమి చవి చూడడంతో గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా వైసీపీకి గుడ్ బై చెప్పారు.
* పవన్ ను ఓడించిన దక్కని మంత్రి పదవి
భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రావు కు జైంట్ కిల్లర్ గా పేరు ఉంది. 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పై గెలిచారు గ్రంధి శ్రీనివాస్. రాష్ట్రస్థాయిలో ఆకర్షించగలిగారు. పవన్ పై గెలవడంతో మంత్రి పదవి ఖాయమని ఆశలు పెట్టుకున్నారు. కానీ జగన్ ఆ ఆశలను నీరుగార్చారు.కనీసం విస్తరణలోనైనా తనకు ఛాన్స్ దక్కుతుందని గ్రంధి శ్రీనివాస్ భావించారు. అప్పుడు కూడా జగన్ పరిగణలోకి తీసుకోకపోవడంతో మనస్థాపానికి గురయ్యారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఘోర పరాజయం చవిచూశారు. అందుకే ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే ఆ ఇద్దరు నేతలు జగన్ వైఖరిపై విమర్శలు చేశారు. తాము ఏ పార్టీలో చేరమని.. కుటుంబ జీవనానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పడం విశేషం. అయితే కుటుంబంతో జీవనం గడపడానికి అనుకుంటే రాజకీయ విమర్శలు చేయరు కదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కచ్చితంగా రాజకీయ వ్యూహం ఉంటుందన్న అనుమానాలు ఉన్నాయి. మరి వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.