Folk Singer Asirayya : రైళ్లలో పాటలు పాడుకొని కడుపునింపుకున్న కళాకారుడు ఆయన. వీధి దీపాల మధ్య నాటకాలాడుతూ కుటుంబానికి పట్టెడన్నం కోసం పరితపించేవాడు ఆయన. చేతిలో చిన్నపాటి జముకు వాయిద్యంతో సప్తస్వరాలు పలికించాడు ఆయన. అయినా రోజువారి జీవితం దుర్భరమే. బతుకుబండి కష్టమే. అటువంటి వ్యక్తి ఈ రోజు లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆటో ఎక్కేందుకు కష్టమనుకున్న ఆయన ఏకంగా విమానం ఎక్కే చాన్స్ దక్కించుకున్నాడు. ఆయనే జముకు కళాకారుడు అసిరయ్య. పూర్వపు శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం వాల్తేరు గ్రామానికి చెందిన అసిరయ్యపై ‘ఓకే తెలుగు’ ప్రత్యేక కథనం.
జానపదాలకు క్రేజ్…
టీవీల రాక మునుపు జానపదాలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. ప్రతీ గ్రామంలో జానపద ప్రదర్శనలు సాగేవి. కానీ టీవీ సంస్కృతి ఎంటరయ్యాక.. జానపదాల ప్రదర్శనలు నిలిచిపోయాయి. కళాకారులకు గడ్డురోజులు దాపురించాయి. ఈ బాధిత వర్గంలో అసిరయ్య కూడా ఉన్నాడు. పగలంతా పాలేరుగా పనిచేసే అసిరయ్య.. రాత్రి మరో ఇద్దరు బృందంతో జముకుల కథను ప్రదర్శించేవాడు. పండుగలు, ప్రత్యేక దినాల్లో ఈ బృందం గ్రామాల్లో ప్రదర్శనలిచ్చేది. నిర్వాహకులు నగదు, బియ్యం ఇచ్చేవారు. రాత్రంతా ప్రదర్శనలిచ్చే అసిరయ్య ఉదయానికే పాలేరు పనికి వెళ్లేవాడు. ఈ క్రమంలో అనారోగ్య సమస్యలు, నిద్రలేమి వెంటాడేది. అయినా కుటుంబ జీవనం కోసం తప్పనిసరి అయ్యేది
బతుకు దుర్భరంగా మారి..
అయితే టీవీల రాక ప్రారంభంతో జముకుల కథకు ఆదరణ తగ్గింది. అటు పాలేరుతనం కూడా కష్టమైంది. దీంతో తాను నమ్ముకున్నజముకుతో బతుకుపోరాటానికి బయలుదేరాడు. కానీ దారంతా చీకటిగా ఉన్న ఛేదించుకొని ముందుకు సాగాలనుకున్నాడు. చివరకు రైళ్లలో జముకు పాటలు పడి ప్రయాణికులు ఇచ్చే చిల్లరతో బతుకు బండి లాగించుకోవడానికి డిసైడయ్యాడు. శ్రీకాకుళం నుంచి విశాఖ మధ్య తిరిగే ప్యాసింజర్ రైళ్లలో పాటలు పడేవాడు. స్టేషన్ల మధ్య రైళ్లు మారుతూ అసిరయ్యే పడే బాధలువర్ణనాతీతం. ఈ క్రమంలో అసిరయ్య గురించి తెలుసుకున్న విశాఖలోని శ్రీమాత మ్యూజిక్ హౌస్ ప్రతినిధులు పల్లి నాగభూషణరావు, బీఎన్ మూర్తిలు తమ ఆల్బమ్ లో పాడించారు. అవి బహుళ ప్రాచుర్యం పొందాయి.
సిల్వర్ స్క్రీన్ పై మెరుపు..
ఈ క్రమంలో అసిరయ్య పాటలను గుర్తించి మ్యూజిక్ డైరెక్టర్ కుంచె రఘు ప్రోత్సాహమందించారు. హైదరాబాద్ పిలిపించుకున్నారు. అసిరయ్యలోని జానపద నైపుణ్యాన్ని చూసి అబ్బురపడ్డారు. అసిరయ్య నోటి నుంచి వచ్చిన జానపదం ‘నాదీ నక్లీసు గొలుసు’ లిరిక్ తో సాగే పాటను పలాస సినిమాకు స్వరపరిచారు. ఆ పాట బహుళ ప్రాచుర్యం పొందింది. దీంతో అప్పటి నుంచి అసిరయ్యకు సిల్వర్ స్క్రీన్ మీద గుర్తింపు లభించింది. సినిమా అవకాశాలు ప్రారంభమయ్యాయి. ఎన్నెన్నో వేదికల్లో జముకుల ప్రదర్శనలు ఇచ్చారు. అయితే ఎంత ఎత్తకు ఎదిగినా ఒదిగి ఉండాలని అసిరయ్య చెబుతున్నాడు. తనకు బతుకునిచ్చిన జముకు వాయిద్యంతో పాటు వీధి దీపాలతో పాటు దానికి ఒత్తుగా పెట్టుకున్న కర్రను సైతం భద్రంగా దాచుకున్నాడు. నా ఈ స్థితికి అవే కారణమని సగర్వంగా చెబుతున్నాడు. ఎన్నో పురస్కారాలు అందుకున్న అసిరయ్య ప్రతిభకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ వారు గుర్తించారు. మే 26 27 28 న నాట్స్ ద్వారా జరిగే ఉత్తర అమెరికా తెలుగు సంబరాలలో అసిరయ్య జానపద కళ ని పరిచయం చేయనున్నారు. కళా పురస్కారం ప్రదానం చేయనున్నారు.