Farmers face fertilizer shortage crisis: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది వైసీపీ( YSR Congress party ) నేతల పరిస్థితి. కాలానుగుణంగా చేయవలసిన కార్యక్రమాలు, ఆందోళనలను మరిచిపోతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అదిగో పులి అన్నట్టు అప్పటికప్పుడు ఆందోళనలకు పిలుపునిస్తోంది. తాజాగా యూరియా కొరతపై ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. ఎరువుల కొరతతో రైతులు అల్లాడిపోతున్నారని.. ఖరీఫ్లో అవసరమైన ఎరువులు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఈరోజు ఆందోళనలకు పిలుపునిచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. అన్ని డివిజన్ కేంద్రాలలో ఆందోళనలు చేయాలని సూచించింది. దీంతో పార్టీ క్యాడర్ ఆందోళనలకు సిద్ధమయింది. అయితే ఈ కార్యక్రమం ఎంతవరకు సక్సెస్ అవుతుందో అన్నది చూడాలి. ఇప్పటివరకు వైసీపీ పిలుపునిచ్చిన కార్యక్రమాలన్నీ తూతూ మంత్రంగా జరిగాయి. ఇది రైతు సమస్య కావడంతో తప్పకుండా విజయవంతం అవుతుందని వైసిపి అంచనా వేస్తోంది. కానీ రైతులు రాకుండా వైసీపీ శ్రేణులు ముగిస్తే మాత్రం అసలుకే ఎస్సరు రావడం ఖాయం.
అప్పట్లో వదిలేసి..
సాధారణంగా ఖరీఫ్( kharif ) జూలైలోనే ప్రారంభం అవుతుంది. తొలు తా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు ప్రారంభం కావడంతో జూలై నెలాఖరు నుంచి వరి దమ్ములు ప్రారంభం అయ్యాయి. ఆగస్టు నాటికి కొంత మొత్తంలో వరి నాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ఆగస్టు నెలలో యూరియా కొరత తీవ్రంగా ఉండేది. ఆధార్ కార్డు పై ఒక బస్తా మాత్రమే సరఫరా చేసేవారు. దీంతో రైతుల్లో ఆందోళన కూడా వ్యక్తం అయింది. ఆ సమయంలో వైసీపీ బయటకు వచ్చి ప్రభుత్వం పై ఒత్తిడి చేస్తే ఆ పార్టీకి రాజకీయంగా మైలేజ్ పెరిగేదన్న వాదన వినిపిస్తోంది. కానీ ఇప్పుడు రైతులందరికీ పుష్కలంగా ఎరువులు లభిస్తున్నాయి. ఇటువంటి సమయంలో ఆందోళనలకు పిలుపునివ్వడం ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది. కొరత తీవ్రంగా ఉన్న సమయంలో ఆందోళనలు చేసి ఉంటే రైతులు గుర్తించేవారు. కానీ ఎందుకో వైసీపీ ఇటువంటి విషయాల్లో సరైన రీతిలో గుర్తించడం లేదు. ఈ అవకాశాన్ని ఆ పార్టీ జేజేతుల వదులుకున్నట్టే.
బలమైన శ్రేణులు ఉన్న..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల చేతుల్లో దాదాపు 80% పంచాయితీలు ఉన్నాయి. ఎంపీపీలతో పాటు జడ్పిటిసిలు ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్లు కొనసాగుతున్నారు. వీరందరిదీ గ్రామీణ నేపథ్యం. తప్పనిసరిగా వీరికి రైతుల బలం ఉంటుంది. ఎరువుల కొరత తలెత్తిన క్రమంలో వీరంతా రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపి ఉంటే తప్పకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరేది. కానీ సమస్య ఉన్నప్పుడు విడిచిపెట్టారు. ఇప్పుడు అందరికీ ఎరువులు సరఫరా చేసేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేసింది. గ్రామాలకు ఎరువులు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆందోళన చేస్తే రైతులు గుర్తించే ఛాన్సే లేదు. కానీ సోషల్ మీడియాలో ఎరువుల కొరత ఉందని అధికంగా ప్రచారం చేస్తున్నారు. ఆపై ఇప్పుడు ఈరోజు ఆందోళనలకు దిగుతున్నారు. ఈ నిరసన విఫలమైతే మాత్రం ఆ పార్టీకి ఇబ్బందికరమే. ఎరువుల కొరత మాట దేవుడెరుగు.. ఆందోళన కార్యక్రమంలో రైతుల కొరత కనిపిస్తే మాత్రం ముమ్మాటికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కష్టమే. చూడాలి ఏం జరుగుతుందో.