YSRCP Job Mela: ఏపీలో రీజియన్ల వారీగా వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి జాబ్ మేళాలు నిర్వహించారు. విశాఖ, గుంటూరు, తిరుపతిలో జాబ్ మేళాలు కొనసాగాయి. రాష్ట్రంలో నిరుద్యోగులను ఆదుకునేందుకు సీఎం జగన్ ఆదేశాలతో జాబ్ మేళాలు నిర్వహించినట్టు అప్పట్లో విజయసాయి ప్రకటించారు. అదే సమయంలో ప్రభుత్వ అనుమతి లేకుండా, జగన్ కు తెలియకుండా విజయసాయి జాబ్ మేళాలు నిర్వహించారంటూ అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. దీనిపై సీఎం జగన్ విజయసాయిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా టాక్ నడిచింది. అయితే దీనిపై అప్పట్లో విజయసాయి వివరణ ఇవ్వడం, జాబ్ మేళాలు నిర్వహించడం జరిగిపోయింది. కానీ ఇన్నాళ్లకు మరోసారి ఆ జాబ్ మేళాలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే అక్కడ ఉద్యోగాలన్ని ఫేక్ అని.. రిక్రూట్ మెంట్ కు హాజరైన కంపెనీలన్నీ బోగస్ అని తేలుతోంది. వాటిపై పోలీసు కేసులు నమోదవుతుండడంతో విజయసాయిరెడ్డి విమర్శలపాలవుతున్నారు.

నాడు హడావుడిగా…
నాడు జాబ్ మేళాల విషయంలో విజయసాయిరెడ్డి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని ఆర్భాటంగా ప్రకటించారు. పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. ఊరూ వాడా ప్రచారం చేశారు. అటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతల సిఫారసులతో నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారని టాక్ నడిచింది. కానీ అక్కడకు ఎక్కువగా వచ్చింది సెక్యూరిటీ గార్డు రిక్రూట్ మెంట్ సంస్థలేనని.. ఊరూ పేరూ లేని సాఫ్ట్ వేర్ సంస్థల ప్రతినిధులు వచ్చి ఇంటర్వ్యూ చేశారన్న విమర్శలు వచ్చాయి. కానీ అప్పట్లో దీనిని ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పడు ఆ సాఫ్ట్ వేర్ కంపెనీలన్ని బోగస్ అని తేలుతోంది. విశాఖలోని సాఫ్ట్ వేర్ కంపెనీపై అక్కడ ఉద్యోగంలో చేరిన వారు పోలీసులకు ఫిర్యాుదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నాడు జాబ్ మేళా నిర్వహించి.. ఉద్యోగులుగా ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించింది విజయసాయిరెడ్డి కావడంతో ఇప్పడు ఆయన పేరు బయటకు వస్తోంది.
నెలల తరబడి జీతాలు లేవు..
ప్రస్తుతానికి విశాఖ జాబ్ మేళాకు హాజరైన రెండు కంపెనీల్లో బోగస్ వెలుగుచూసింది. సదరు కంపెనీలు ఒక్కో అభ్యర్థి వద్ద రూ.30 వేలు తీసుకొని శిక్షణనిస్తామని చెప్పాయి. కానీ నెలలు గడుస్తున్నా శిక్షణ లేదు. అటు జీతాలు అందించడం లేదు. విసిగి వేశారిపోయిన ఉద్యోగులు తమకు జాబు వద్దు.. శిక్షణ వద్దు.. మేము కట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేయ్యాలని కోరారు. కానీ సంబంధించి కంపెనీల ప్రతినిధులు బెదిరించి పంపించేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సంబంధిత కంపెనీలపై కేసు నమోదు చేశారు. అయితే కంపెనీ మూలాలపై ఆరా తీయగా..ఎంపీ విజయసాయి జాబ్ మేళాలో ఇవి వెలుగులోకి వచ్చినట్టు తేలింది. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలంటే ఇవేనా అంటూ ఎంపీ విజయసాయిపై షటైర్లు ప్రారంభమయ్యాయి.

మిగతా రెండు చోట్ల?
అయితే జాబ్ మేళా ఒక్క విశాఖలోనే కాదు. గుంటూరు, తిరుపతిలో కూడా నిర్వహించారు. అక్కడ కూడా ఎక్కువగా సెక్యూరిటీ గార్టు నియామకాలకు సంబంధించి ఏజెన్సీలే జాబ్ మేళాలో పాల్గొన్నట్టు విమర్శలు వచ్చాయి. గతంలో ఎన్నడూ వినని పేర్లతో సాఫ్ట్ వేర్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. విశాఖలో వెలుగుచూసినట్టే అక్కడ కూడా బోగస్ సంస్థల లీలలు బయటకు వచ్చే అవకాశముందని టాక్ నడుస్తోంది. అయితే ఇవి ఎంపీ విజయసాయిరెడ్డి మెడకు చుట్టుకునే అవకాశమున్నట్టు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. లిక్కరు స్కాంలో ఆయన అల్లుడి పేరు బయటకు వచ్చింది. అటు ఏపీలో కీలక నాయకుల కుటుంబసభ్యుల పేర్లు బయటకు రావడానికి ఆయన నిర్లక్ష వైఖరే కారణమన్న ఆరోపణలున్నాయి. అటు వైసీపీ అధిష్టానం కూడా ఆయన పదవులకు కోత పెడుతుందన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు జాబ్ మేళాల బోగస్ మరిన్ని కష్టాలు తెచ్చి పెట్టే సూచనలైతే కనిపిస్తున్నాయి.