Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల పర్యటనలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. అయితే ఆయన పర్యటనల్లో భద్రతా లోపం వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం చర్చకు దారితీస్తోంది.ఇటీవల ఆయన ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. పార్వతీపురం మన్యంలో కీలక పర్యటనలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఒక లోపం వెలుగు చూసింది. పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి హల్చల్ చేసినట్లు గుర్తించారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసు యంత్రాంగం గట్టి భద్రత కల్పించింది. అదే సమయంలో యూనిఫాంలో ఐపీఎస్ హోదాలో ఒక వ్యక్తి ప్రవేశించారట. ఆయన పేరు సూర్య ప్రకాష్ గా తెలుస్తోంది. పవన్ టూర్ ముగిసిన తర్వాత విజయనగరం నుంచి హైదరాబాద్ వెళుతుండగా విజయనగరం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పవన్ టూర్ లోకి ఆయన ఎందుకు వచ్చాడు అన్నదానిపై ఆరా తీస్తున్నారు.
* విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తి
అయితే సూర్య ప్రకాష్ తూనికలు కొలతల శాఖలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ ను కలిసేందుకు అలా ఐపీఎస్ అధికారిగా అవతారం ఎత్తినట్లు సమాచారం. అయితే ఆయనకు పోలీస్ యూనిఫామ్ ఎక్కడ దొరికింది? పోలీసులు ఆయనకు చెక్ చేయకుండా ఎందుకు విడిచి పెట్టారు? అన్న దానిపై చర్చ జరుగుతోంది. సూర్య ప్రకాష్ ది విజయనగరం జిల్లాగా తెలుస్తోంది. మెరకముడిదాం మండలానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రాణానికి హాని ఉందని ఆ మధ్యన కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. సరిగ్గా ఇదే సమయంలో భద్రతా లోపం వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది.
* పోలీస్ శాఖ తీరుపై చర్చ
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో పోలీస్ శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న విమర్శ ఉంది. కొద్దిరోజుల కిందటే పవన్ కళ్యాణ్ పోలీస్ శాఖ తీరును ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కొందరు అధికారులు వైసిపి పాలన నడుస్తుందన్న భావనతో పని చేస్తున్న విషయాన్ని తప్పుపట్టారు. హోం శాఖ మంత్రి తీరుపై కూడా ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా లో జరుగుతున్న అరాచకాలపై పవన్ మాట్లాడిన తరువాతే చర్యలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తన పర్యటనలోనే.. ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవేశించారని తెలియడంతో పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.