Kanna Lakshminarayana : కాకరేపుతున్న కన్నా వ్యాఖ్యలు.. జగన్ గురించి వైఎస్ దగ్గర తప్పుగా మాట్లాడిందెవరు?

వ్యక్తిగత విమర్శలకు దిగితే..అంతకు మించి ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇకనైనా అటువంటి చౌకబారు మాటలు మానుకోవాలని కన్నా హితవుపలికారు. మొత్తానికైతే కన్నా వ్యాఖ్యలు వైసీపీలో కాక రేపుతున్నాయి. 

Written By: Dharma, Updated On : July 22, 2023 6:10 pm
Follow us on

Kanna Lakshminarayana : ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఫైర్ అయ్యారు. బీజేపీ నుంచి టీడీపీలో చేరిన తొలిసారి స్ట్రాంగ్ గా రియాక్టయ్యారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సుదీర్ఘ కాలం పనిచేసిన కన్నా.. ఆయన హయాంలో కీలక పోర్టుపోలియోలు నిర్వహించారు. వైఎస్ఆర్ కు అత్యంత సన్నిహితుల్లో కన్నా లక్ష్మీనారాయణ ఒకరు. కానీ జగన్ వెంట నడవకుండా తొలుత బీజేపీలో.. ఇప్పుడు టీడీపీలో పనిచేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు, పవన్ లపై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు వైఎస్ హయాంలో జరిగిన విషయాలను ప్రస్తావించారు.

జగన్ అనే వ్యక్తి నీలాంటి వ్యక్తికి కొడుకుగా పుట్టాల్సి ఉండేది కాదని నాటి సహచరులుగా ఉన్నవారు చేసిన కామెంట్స్ ను కన్నా ప్రస్తావించారు. నాడు అలా అన్నవారు ఇప్పుడు జగన్ చుట్టూనే ఉన్నారని కన్నా చెప్పుకొచ్చారు. అయితే పవన్ ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారన్నది తెలియాల్సి ఉంది. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో పనిచేసిన వారిలో ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ఉన్నారు. మిగతావారంతా జూనియర్లే. వైసీపీ ఆవిర్భావ సమయంలో ధర్మాన, బొత్స..ఇద్దరు కాంగ్రెస్ లోనే ఉండేవారు. జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ లెక్కన నాడు రాజశేఖర్ రెడ్డి దగ్గర ఈ ఇద్దరు నేతలే అనుచిత వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వాస్తవానికి జగన్ పొలిటికల్ ఎంట్రీ కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. తండ్రి సీఎం పోస్టును అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు లూటీ చేశారన్న ఆరోపణలున్నాయి. దీనిపై నాడు అసెంబ్లీలో పెద్ద దుమారం రేగింది. అయితే జగన్ వైఖరి రాజశేఖర్ రెడ్డికి సైతం నచ్చేది కాదన్న ప్రచారం జరిగింది. జగన్ యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ తరువాతే రాజశేఖర్ రెడ్డి కి కుమారుడి రూపంలో కష్టాలు మొదలయ్యాయన్న తోటి నాయకులు ఇప్పటికీ చెబుతుంటారు. ఎక్కడా వైఎస్ పేరు కాకుండా జగన్ ప్రస్తావనే అప్పట్లో ఎక్కువగా నడిచేది. దీనిపై తాజాగా కన్నా లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చారు. జగన్ ప్రవర్తన చూసి వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తుందని కూడా వ్యాఖ్యానించారు.

బహిరంగ సభల్లో జగన్ మాట్లాడుతున్న భాష సరిగా లేదని కన్నా విమర్శించారు. ప్రజల సొమ్ముతో ఏర్పాటుచేసిన బహిరంగ సభలు, సమావేశాల్లో ఉచ్ఛనీచాలు లేకుండా మాట్లాడటం జగన్ కే  చెల్లిందని దుయ్యబట్టారు. గతంలో ఎంతమంది కలిసినా నా వెంట్రుక పీకలేరన్నజగన్, ఇప్పుడు ఓటమి భయంతో ఎందుకు దిగజారి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. పవన్ పై వివాహేతర సంబంధాలు అంటగట్టిన నేపథ్యంలో జగన్ చీకటి బాగోతాలు ఎవరికీ తెలియవన్నట్టు గురివిందగింజలా ఇతరుల్ని వేలెత్తి చూపుతున్నారని కన్నా విమర్శించారు. వ్యక్తిగత విమర్శలకు దిగితే..అంతకు మించి ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇకనైనా అటువంటి చౌకబారు మాటలు మానుకోవాలని కన్నా హితవుపలికారు. మొత్తానికైతే కన్నా వ్యాఖ్యలు వైసీపీలో కాక రేపుతున్నాయి.