Nara Lokesh: ప్రతికూల పరిస్థితులను అధిగమించి సమర్థ నాయకుడు అనిపించుకున్నారు చంద్రబాబు( AP CM Chandrababu). 1995లో టిడిపి సంక్షోభంలో.. ఎన్టీఆర్ నుంచి పార్టీతో పాటు ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్న సమయంలో.. చంద్రబాబు వెన్నుపోటు దారుడు అని ముద్రపడింది. చాలా కాలం పాటు అపవాదు అలానే ఉండిపోయింది. కానీ తన పనితీరు, సమర్థతతో ఆ అపవాదును రూపుమాపుకున్నారు చంద్రబాబు. సమర్థతతో పాటు అభివృద్ధి అజెండా పుణ్యమా అని తనకంటూ ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో స్థానం సంపాదించుకున్నారు. అయితే చంద్రబాబు మాదిరిగానే ఆయన కుమారుడు లోకేష్ సైతం రాజకీయాల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు. అయితే తండ్రి మాదిరిగానే సమర్థతతో వాటిని ఎదుర్కొనే తీరు మాత్రం అభినందనలు అందుకుంటోంది. ఆయన ఎదిగిన తీరు చాలా భిన్నంగా ఉంది. పొలిటికల్ గ్రాఫ్ కూడా చాలా వేగంగా విస్తరించింది. చంద్రబాబు తండ్రి గానే కాకుండా.. మార్గదర్శకుడుగా నిలిచారు. కుమారుడిని సమర్థవంతమైన నేతగా తీర్చిదిద్దారు. అదే సమయంలో లోకేష్ సైతం రాజకీయ పాఠాలను క్షుణ్ణంగానే నేర్చుకున్నారు.
Also Read: అమరావతి భవిత.. బనకచర్ల ప్రణాళిక.. నిర్మొహమాటంగా చెప్పేసిన చంద్రబాబు!
* సంక్షోభాలను దాటుకుంటూ..
సంక్షోభాలను, సవాళ్లను ధీటుగా ఎదుర్కొన్నారు సీఎం చంద్రబాబు. ప్రతికూల పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తన నాయకత్వ సమర్థత నిరూపించుకునేందుకు… చాలా రకాల అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా పెను విపత్తులు ఎదురైనప్పుడు.. ప్రజలను అలవోకగా కష్టాల నుంచి గట్టెక్కించగల నేర్పరి చంద్రబాబు. అందుకే ఒడిస్సా ప్రజలు సైతం చంద్రబాబు నాయకత్వాన్ని ఇష్టపడతారు. ప్రజలకు ఎన్నో రకాల ప్రకృతి వైపరీత్యాలనుంచి బయట పడేశారు చంద్రబాబు. అయితే ఇప్పుడు లోకేష్ సైతం చంద్రబాబు మాదిరిగానే ప్రజలకు అండగా ఉంటున్నారు. నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని ఏపీకి రప్పించడంలో లోకేష్ విజయవంతం అయ్యారు. సింగిల్ హ్యాండ్ లో ఈ పెద్ద టాస్క్ ని డీల్ చేసి అందరి చేత అభినందనలు అందుకున్నారు.
* టిడిపి శ్రేణులకు నమ్మకం కలిగేలా..
లోకేష్( Nara Lokesh ) అంటే టిడిపి శ్రేణులకే నమ్మకం లేనంత పరిస్థితి ఉండేది. అటువంటి సమయంలో లోకేష్ కంటే జూనియర్ ఎన్టీఆర్ను తెచ్చుకుంటే మంచిది అని అభిప్రాయం వినిపించేది. కానీ లోకేష్ అలా ఉండిపోలేదు. తనపై ఉన్న అభిప్రాయాన్ని మారేలా చేసుకున్నారు. పార్టీ శ్రేణుల బాగోగులు చూసే నేతగా ఎదిగారు. వారికి బీమా సౌకర్యాన్ని కల్పించి ధీమా కల్పించారు. ఎప్పటికప్పుడు పార్టీ క్యాడర్ తోనే కాదు నాయకులతో సమావేశాలు పెడుతూ.. పార్టీలో తన స్థానం ఏమిటో సంకేతాలు పంపారు. మొన్నటి వరకు పార్టీ అంటే చంద్రబాబు మాత్రమే అనే అభిప్రాయం ఉండేది. ఇప్పుడు మాత్రం చంద్రబాబుతో పాటు లోకేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ముందు పార్టీ శ్రేణుల్లో పట్టు సాధించారు. సీనియర్లను సైతం ఆకట్టుకుంటున్నారు. పార్టీ మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో సమన్వయం చేసుకుంటున్నారు. వారందరూ తమ ఫ్యూచర్ లీడర్ లోకేష్ అని భావించేలా యువనేత తనను తాను ఆవిష్కరించుకోవడం గొప్ప విషయం.
* భిన్నాభిప్రాయాలకు చెక్
ఒకప్పుడు లోకేష్ అంటే చంద్రబాబు తనయుడు. వారసత్వంగా వచ్చిన నేత. అన్నింటికీ మించి బలవంతంగా రుద్దపడిన నాయకుడు. ఇలా రకరకాల అభిప్రాయాలు ఆయనపై ఉండేవి. అందుకే కేంద్ర పెద్దలు సైతం లోకేష్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారన్న ప్రచారం ఉండేది. కానీ ఇప్పుడు అదే లోకేష్ ను ఢిల్లీ పిలిపించుకుని మాట్లాడుతున్నారు కేంద్ర పెద్దలు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా సమయం ఇచ్చి లోకేష్ తో మాట్లాడుతున్నారు. కేంద్ర పెద్దలను, కేంద్ర మంత్రులను లోకేష్ అలవోకగా కలుస్తున్నారు. జాతీయస్థాయిలో సైతం తన పరపతిని పెంచుకుంటున్నారు. చంద్రబాబు సైతం ఒక వ్యూహం ప్రకారం లోకేష్ కు పనులు అప్పగిస్తున్నారు. వాటిని ఇట్టే పూర్తిచేసి ఆకట్టుకుంటున్నారు లోకేష్. కేవలం దర్శకత్వం మాత్రమే చేస్తున్నారు చంద్రబాబు. ఈ పరిస్థితి చూస్తుంటే భావి నాయకుడిగా తెలుగుదేశం పార్టీ గుర్తించింది. ఆపై కేంద్రం గుర్తించింది. జాతీయస్థాయిలో కూడా ఇప్పుడు బలమైన చర్చ సాగుతోంది. ఏదైనా లోకేష్ ను ప్రొజెక్ట్ చేస్తున్న తీరు అభినందనలు అందుకుంటోంది.