BJP – Chandrababu Naidu : బీజేపీ ముందుకొస్తున్నా చంద్రబాబు మౌనమే

అందుకే బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు పొత్తులపై సానుకూలత వ్యక్తం చేస్తున్నా చంద్రబాబు మాత్రం మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. కొద్దిరోజుల పాటు అదే వ్యూహాన్ని అమలుచేయనున్నారన్న మాట. 

Written By: Dharma, Updated On : July 12, 2023 6:49 pm
Follow us on

BJP – Chandrababu Naidu : బీజేపీతో పొత్తుల విషయంలో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారా? ఆ పార్టీతో వెళితే జగన్ కు పాజిటివిటీ పెరుగుతుందని భయపడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చంద్రబాబు వ్యవహార శైలి అలానే ఉంది. నిన్నటివరకూ బీజేపీ ఎప్పుడు కలిసి వస్తుందా.. కలుపుకొని పోదామా అంటూ చంద్రబాబు తహతహలాడారు. మూడు పార్టీలు కలిస్తే జగన్ ను ఎంచక్కా అధికారంలో నుంచి దూరం చేయవచ్చని భావించారు. అయితే ఇప్పుడు ఎక్కడో తేడా కొడుతున్నట్టుంది. అందుకే బీజేపీ నుంచి సానుకూలత వస్తున్నా బాబు అందిపుచ్చుకోవడం లేదు. అల్లుకుపోవడం లేదు. మునుపటిలా స్పందించడం లేదు.

కాషాయ దళంలో చిన్నపాటి నాయకుల నుంచి పొత్తుల విషయంలో సానుకూలత వచ్చినా చంద్రబాబు తెగ మురిసిపోయేవారు. వారి మాటలతో ఖుషీ అయ్యేవారు. అయితే సాక్షాత్ కేంద్ర మంత్రి నారాయణస్వామి పొత్తులపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఏపీలో టీడీపీ, జనసేనలతో కలిసే బీజేపీ వెళుతుందని ప్రకటించారు. కేంద్ర మంత్రి అనంతపురం పర్యటనకు వచ్చారు. పొత్తులపై క్లీయర్ కట్ గా చెప్పేశారు. అయినా చంద్రబాబు దానిని లైట్ తీసుకున్నారు. స్పందించలేదు సరికదా.. మీడియా ప్రతినిధులు అడిగినా ముక్తసరిగా సమాధానం చెప్పి ముగించేశారు. ఏవేవో లెక్కలు చెప్పి చంద్రబాబు తప్పించుకోవడం చూసి ఆశ్చర్యపోవడం మీడియా ప్రతినిధుల వంతైంది.

ఈ విషయంలో చంద్రబాబు కాస్తా భిన్నంగా స్పందించారు. దగాపడ్డ ఏపీని గాడిలో పెట్టడమే తన ముందున్నకర్తవ్యంగా చెప్పుకొచ్చారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించి.,, చైతన్యం తీసుకొచ్చి సెట్ చేయడమే తన ముందున్న బాధ్యత అన్నారు. తన ముందు భారీ లక్ష్యాలు ఉన్నప్పుడు పెద్ద ఆలోచనలు చేయడం అవసరమన్నారు. ఎవరెవరో మాట్లాడిన వాటికి సమాధానాలిస్తూ పలుచన కాదలచుకోలేదని తేల్చిచెప్పారు. అయితే ఓ కేంద్ర మంత్రి, ఆ పై సీనియర్ నాయకుడు పొత్తులపై ప్రకటన చేస్తే చంద్రబాబు స్పందించిన తీరు మాత్రం గతం కంటే భిన్నంగా కనిపించింది.

అయితే చంద్రబాబు ముఖంలో మాత్రం ఓకింత ఆందోళన కనబడుతోంది. బీజేపీ విషయంలో ఏపీ ప్రజలకు  ఓ రకమైన అభిప్రాయం ఉంది. విభజిత రాష్ట్రంగా ఆశించిన స్థాయిలో కేంద్రం నుంచి సహకారం కొరవడింది. ఇది ప్రజల్లో బలంగా ఉందన్న విషయాన్ని గుర్తించే చంద్రబాబు బీజేపీ విషయంలో కాస్తా వెనక్కి తగ్గారన్న టాక్ వినిపిస్తోంది. అందుకే బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు పొత్తులపై సానుకూలత వ్యక్తం చేస్తున్నా చంద్రబాబు మాత్రం మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. కొద్దిరోజుల పాటు అదే వ్యూహాన్ని అమలుచేయనున్నారన్న మాట.