CM Chandrababu: బలమైన సంకల్పంతో ముందుకు సాగుతున్నారు చంద్రబాబు. ఓవైపు ప్రాధాన్యత ప్రాజెక్టులుగా అమరావతి తో పాటు పోలవరాన్ని తీసుకున్నారు. మరోవైపు సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టారు. ఇంకోవైపు పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాల కల్పనపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు. గతంలోనే రాష్ట్రానికి కియా, అమర్ రాజా సహా ఎన్నో పరిశ్రమలను ఏర్పాటు చేయించారు. మరెన్నో పరిశ్రమల యాజమాన్యాలతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. అయితే ప్రభుత్వం మారిన తరుణంలో జగన్ సర్కార్ వేధింపులకు తాళలేక చాలా రకాల పరిశ్రమలు వెళ్లిపోయాయి అన్న విమర్శ ఉంది.అయితే ఇప్పుడు చంద్రబాబు సర్కార్ అధికారంలోకి రావడం, పూర్తి భరోసా కల్పించడంతో పరిశ్రమల ఏర్పాటుకు ఒక్కో అడుగు ముందుకు పడుతోంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో దేశీయ, విదేశీ పారిశ్రామిక సంస్థలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి క్యూ కడుతుండడం శుభపరిణామం. అయితే గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా వాటికి భూ కేటాయింపులు, రాయితీలు ప్రకటిస్తే.. పనులు ప్రారంభించే అవకాశాలు ఉంటాయి. దేశంలో పెట్టుబడులకు సంబంధించిన పరిణామాలు, వేల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన కంపెనీల విస్తరణ సమాచారాన్ని చంద్రబాబు తెలుసుకుంటున్నారు. భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్న విదేశీ విద్యాసంస్థలు, కార్పొరేట్, బిజినెస్ రంగాల్లో పరిణామాలు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు చంద్రబాబు. తద్వారా ఔత్సాహిక పారిశ్రామిక సంస్థలను ఆకర్షించవచ్చని భావిస్తున్నారు.
ఆర్థిక రాజధాని ముంబై, దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా వెలువడే ఆర్థిక, వ్యాపార పెట్టుబడుల సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. తద్వారా పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం సృష్టించి.. సంబంధిత సంస్థలను ఆకర్షించడమే ముఖ్య ఉద్దేశ్యం. ఏవైనా పెద్ద పరిశ్రమలు, సంస్థలు విస్తరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే.. ఆ సమాచారాన్ని ముందుగా తెలుసుకుంటున్న చంద్రబాబు అధికార యంత్రాంగం తో పావులు కదుపుతున్నారు. పెట్టుబడులకు ఏపీ అనువైన కేంద్రం అనే ముద్రను కార్పొరేట్ రంగంలో విస్తరింప చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యం. విధ్వంసమైన ప్రభుత్వ వ్యవస్థలను గాడిన పెట్టడం, అధికార యంత్రాంగం ప్రక్షాళన వంటి వాటితో ప్రగాఢమైన నమ్మకం ఏర్పరచుకోవాలని చూస్తున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో ఏ రాష్ట్రానికి లేని అవకాశం ఏపీకి దొరికింది. కేంద్ర ప్రభుత్వంలో టిడిపి కీలక భాగస్వామ్యం అయ్యింది. పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని సృష్టించగలుగుతున్నారు చంద్రబాబు. అన్నింటికీ మించి పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి అందుబాటులో ఉంది. ఇదే ప్రధానాంశం కానుంది. పైగా రాజకీయ జోక్యం లేకుండా పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు స్వేచ్ఛ ఇస్తున్నారు. వారికి రాజకీయ ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. అయితే చంద్రబాబుకు ఉన్నది 59 నెలల సమయం. ఇప్పటినుంచి పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి కార్యాచరణ ప్రారంభం అయితే.. సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సక్సెస్ కూడా చూసే పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయంగా కూడా కలిసి వస్తుంది. కానీ గతం మాదిరిగా పరిశ్రమల ఏర్పాటులో జాప్యం జరిగితే మాత్రం.. ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
అయితే పరిశ్రమలు ఒకే ప్రాంతంలో విస్తరించకుండా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల్లో ఏర్పాటు చేస్తే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సుదీర్ఘ తీర ప్రాంతం రాష్ట్రం సొంతం. దాదాపు 1000 కిలోమీటర్ల వరకు తీర ప్రాంతం ఉంది. టూరిజం ప్రాజెక్టులకు సంబంధించి అనువైన ప్రాంతాల సైతం ఉన్నాయి. ఎడ్యుకేషనల్, ఐటీ హబ్ లను అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి నిధుల వరద వచ్చే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపనున్నారు. ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా చూడగలిగితే.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సైతం ముందుకు వస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు తన శక్తి యుక్తులను ప్రదర్శిస్తే.. పారిశ్రామిక విధానంలో తప్పకుండా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Establishment of industries these are the biggest challenges before chandrababu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com