Chandrababu Alliance : ఏపీలో పొత్తులపై స్పష్టత రావడం లేదు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళాతాయని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా స్పష్టత రావడం లేదు. రోజుకో రీతిలో ఆ పార్టీల నుంచి సంకేతాలు వస్తున్నాయి. మూడు పార్టీల నాయకత్వాలు గుంభనంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ, జనసేన మాత్రం వైసీపీని ఉమ్మడి శత్రువుగా పరిగణిస్తున్నాయి. బీజేపీ విషయంలో మాత్రం కాస్తా భిన్నమైన వాతావరణం ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీగా జగన్ కు సహాయ సహకారాలు అందిస్తున్న పార్టీ.. రాష్ట్రానికి వచ్చేటప్పటికి విభేదిస్తోంది. అయితే ఇప్పుడు పురంధేశ్వరికి నాయకత్వ బాధ్యతలు అప్పగించడంతో ఆమె ఎలా వ్యవహరిస్తారన్నదే ఇప్పుడు ప్రశ్న.
అయితే పొత్తులపై స్పష్టత రాకపోవడంతో టీడీపీ, జనసేన నేతల్లో ఒకరకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. పొత్తులు కుదిరితే ఒకలా.. కుదరకుంటే మరోలా సమీకరణలు మారే అవకాశం ఉంది. పొత్తులు కుదిరితే జనసేనలో చేరికలు బాగా పెరిగే అవకాశముంది. ముఖ్యంగా గోదావరితో పాటు ఉత్తరాంధ్ర, మధ్య కోస్తాలో చాలా మంది నాయకులు పవన్ గూటికి చేరే అవకాశాలున్నాయి. అటు జనసేనకు సైతం గెలుపు గుర్రాలు అవసరం కాబట్టి సర్దుబాటు తప్పనిసరి. కానీ ఇప్పుడు పొత్తులు ఉంటాయా? ఉండవా? అన్నది సందేహంగా నిలుస్తోంది.
అటు పవన్ కానీ.. ఇటు చంద్రబాబు కానీ ఎక్కడా పొత్తులపై మాట జారడం లేదు. కానీ వైసీపీ ఓటు చీలిపోనివ్వనని పవన్ కామెంట్స్, మరోవైపు అందరూ సమన్వయంతో ఒడిద్దామన్న చంద్రబాబు స్లోగన్స్ తో పొత్తులు ఉంటాయని సంకేతాలు వెలువడుతున్నాయి. పొత్తు అంశాన్ని సజీవంగా ఉంచుతునే ఎవరికి వారు పార్టీలను బలోపేతం చేసేందుకు ఫోకస్ చేశారు. అయితే వారాహి ముందు.. తరువాత అన్న భేరీజు జనసేనలో కనిపిస్తోంది. అంతులేని ఆత్మ విశ్వాసం వ్యక్తమవుతోంది. గోదావరి జిల్లాల్లో 34 నియోజకవర్గాలపై జనసేన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అటు వైసీపీ విముక్త గోదావరి జిల్లాల స్లోగన్ కూడా బాగా వర్కవుట్ అవుతోంది.
అయితే ఇప్పుడు మాత్రం టీడీపీలో ఒకరకమైన స్వరం మారుతోంది. పవన్ వ్యవహార శైలిపై అనుమానం వ్యక్తమవుతోంది. బీజేపీ నుంచి వస్తున్న స్నేహ హస్తంపై కూడా చంద్రబాబు భిన్నంగా రియాక్డవుతున్నారు. మొన్నటికి మొన్న అనంతపురం వచ్చిన కేంద్ర మంత్రి నారాయణస్వామి పొత్తులపై సానుకూల ప్రకటన చేస్తే ఆహ్వానించలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. పవన్ ను వదులుకుంటే ఓటమి కన్ఫర్మ్. ఉంటే పొత్తులతో చిక్కుముళ్లు. అయినా చంద్రబాబుకు సంకట పరిస్థితి తప్పదు. ఎందుకంటే పవన్ అవసరం అనివార్యం. దానిని అధిగమించి వెళ్లాలంటే చంద్రబాబుకు వేరే మార్గం లేదు.