Janasena Symbol: జనసేనకు సరికొత్త చిక్కొచ్చి పడింది. ఎన్నికల ముంగిట పార్టీ గుర్తుపై కలకలం రేగింది. ఇప్పటివరకూ ఉన్న గాజు గ్లాసు గుర్తును ఆ పార్టీకి అధికారికంగా కేటాయించలేదు. ఈసీ తాజాగా ప్రకటించిన ఫ్రీ సింబల్స్ జాబితాలో గాజు గ్లాసు కనిపిస్తోంది. దీంతో జన సైనికుల్లో కలవరం ప్రారంభమైంది. ఏపీ నుంచి టీడీపీ, వైసీపీలు మాత్రమే రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన పార్టీలు. దీంతో ఆ పార్టీ గుర్తులను వాటికే రిజర్వ్ చేశారు. జనసేనకు మాత్రం ఆ చాన్స్ లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.
తగినన్ని ఓట్లు రాక..
గత ఎన్నికల్లో ఈసీ గుర్తింపునకు తగ్గట్టు జనసేనకు ఓట్లు రాలేదు. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీగా ఉండాలంటే.. మొత్తం పోలైన ఓట్లలో కనీసం ఆరు శాతం ఓట్లు, కనీసం రెండు అసెంబ్లీ స్థానాలు అయినా దక్కించుకోవాలి. అయితే గత ఎన్నికల్లో జనసేనకు 5.9 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.. ఒకే అసెంబ్లీ స్థానం గెలిచారు. అందుకే గుర్తింపు పొందలేకపోయారు. అయితే ఇది వచ్చే ఎన్నికలకు అడ్డంకిగా కాబోదని నిపుణులు చెబుతున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత తమ పార్టీ అభ్యర్థులందరికీ అదే గుర్తు కేటాయించాలని ఈసీని అడగవచ్చు. ఈసీ అనుమతించడానికి ఎక్కువ అవకాశం ఉంది.
ఇలా అయితే కష్టమే.,.
అయితే గత ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో జనసేన గాజుగ్లాసు గుర్తుపై పోటీచేసింది. ఈసారి టీడీపీ, బీజేపీలతో పొత్తులతో ముందుకెళ్లనుంది. దీంతో అన్ని నియోజకవర్గాల్లో పోటీచేసే చాన్స్ లేదు. కొన్నిచోట్ల మాత్రమే బరిలో దిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫ్రీ సింబల్స్ జాబితాలో గాజుగ్లాసు ఉండడంతో ఇండిపెండెంట్లు అదే గుర్తును అడిగే చాన్స్ ఉంటుంది. అదే జరిగితే పొత్తులు ఉన్నచోట ఓట్ల బదలాయింపు ఆశాజనకంగా జరగదు. అవగాహన లోపంతో చాలావరకూ ఓట్లు గాజుగ్లాసుకు వెళతాయి. ఇది అంతిమంగా జనసేన మిత్ర పక్షాలకు నష్టం చేస్తోంది. ఇప్పుడు గుర్తు అంశం జనసేనలో అయోమయానికి కారణమవుతోంది.