Peddireddy Midhun Reddy: ఏపీ మద్యం కుంభకోణంలో( liquor scam) కీలక పరిణామం. వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఈడి నోటీసులు ఇచ్చింది. ఈనెల 23న విచారణకు హాజరుకావాలని సూచించింది. మరోవైపు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి సైతం ఈడి నుంచి పిలుపు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 22న ఆయన ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఆ మరుసటి రోజు మిధున్ రెడ్డి హాజరవుతారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ ఇద్దరు నేతలు మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మధ్యలో విజయసాయి రెడ్డికి సంబంధాలు తెగిపోయాయి కానీ.. చివరి వరకు మిధున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. అందుకే మిథున్ రెడ్డి విషయంలో ఈ డి సీరియస్ గా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
ఏ 5 నిందితుడిగా..
మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డి( Vijay Sai Reddy ) ఏ5 నిందితుడిగా ఉన్నారు. అయినా ఆయన అరెస్టు జరగలేదు. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు ఆయన సహకరిస్తున్నందు వల్లే ఆయన అరెస్టు జరగలేదు. ఆయన నోరు తెరిచిన తర్వాత మాత్రమే మద్యం కుంభకోణం కేసులో అరెస్టులు ప్రారంభమయ్యాయి. అందుకే ఇప్పుడు ఈడి ముందుగా విజయసాయిరెడ్డి ని పిలిచింది. ఆయన నోరు తెరిస్తే మాత్రం మిగతా నిందితులకు ఇబ్బందికరమే. ఎందుకంటే భారీగా మద్యం కుంభకోణం కేసులో చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. మద్యం సరఫరా చేసే డిష్టలరీల నుంచి భారీగా కమిషన్లకు పాల్పడినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. ఇప్పటికే సిట్ నుంచి కొన్ని వివరాలను సేకరించింది ఈడి. ఇప్పుడు వరుస పెట్టి నిందితులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తుండడం మాత్రం సంచలనాలకు తెర తీసే అవకాశం ఉంది.
మిధున్ రెడ్డి కీరోల్..
మద్యం కుంభకోణం కేసులు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి( Mithun Reddy ) పాత్రపై అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. ఆయన కీరోల్ ప్లే చేసినట్లు పక్క ఆధారాలు సిట్ వద్దకు చేరాయి. మద్యం కుంభకోణం కేసులో సంపాదించిన సొమ్మును లాండరింగ్ కు పాల్పడడం, రూటింగ్ చేయడం వంటి విషయాల్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాత్ర ఉన్నట్లు గుర్తించారట. అయితే విజయసాయిరెడ్డి వివరాలు అందించడంతో ఆయన విషయంలో ఎటువంటి అరెస్టులు లేవు. ఇప్పుడు ఈడీ ఎదుట ఎదురైన క్రమంలో సైతం విజయసాయిరెడ్డి మరిన్ని వివరాలు అందించేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. మరోవైపు చుట్టూ ఉండే కోటరీ అమ్ముడుపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో వెనుజువేలా అధ్యక్షుడిని చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. తద్వారా మున్ముందు మరిన్ని సంచలనాలు ఉండబోతున్నాయని సంకేతాలు పంపారు. దీంతో ఈడి నోటీసులు ఇప్పుడు మరిన్ని సంచలనాలకు వేదిక కానున్నాయి. ఈనెల 22న విజయసాయిరెడ్డి ఈడి ఎదుట హాజరయ్యే క్రమంలో మరిన్ని వివరాలు అందించే ఛాన్స్ కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?
