Wedding Twist: కళ్యాణమండపం కళ కళలాడుతోంది. బంధువుల రాకతో సందడిగా ఉంది. పెళ్లి కుమార్తెను అందంగా ముస్తాబు చేశారు. భాజా భజంత్రీల చప్పుళ్లతో ఆ ప్రాంతం హడావిడిగా ఉంది. మరి కాసేపట్లో పెళ్లి కుమారుడు వేదిక మీదికి రావాల్సి ఉంది. ఇంతలోనే బంధువుల్లో కలకలం నెలకొంది. పెళ్లి కుమార్తె తరఫు వారు ఆందోళనలో కోరుకుపోయారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన పాలి సత్యనారాయణకు.. గోపాలపురం మండలం భీమోలు ప్రాంతానికి చెందిన యువతీతో వివాహం గతంలో నిశ్చయమైంది. సోమవారం వివాహం జరగాల్సి ఉంది. అయితే పెళ్లికొడుకు హఠాత్తుగా మాయమయ్యాడు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత.. పెళ్లి కుమారుడు కనిపించకపోవడంతో ఆందోళన నెలకొంది. ఇదే విషయంపై పెళ్లి కుమారుడు బంధువులు పెళ్లి కుమార్తె తరఫు వారికి ఫోన్ చేసి ఈ సమాచారం అందించారు. దీంతో పెళ్లి కుమార్తె తరఫు బంధువులు దేవరపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.. అయితే ఇక్కడే పెళ్లి కుమార్తె తరపు వారికి అసలు విషయం తెలిసింది.
Also Read: మహిళలకు ఫ్రీ బస్ ద్వారా ప్రయోజనం ఎవరికి.?
సత్యనారాయణకు ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. భర్త చనిపోయిన మహిళను సత్యనారాయణ వివాహం చేసుకున్నాడు. అంతేకాదు ఆమె కుమార్తెకు కూడా అతడే వివాహం జరిపించాలని తెలుస్తోంది. సత్యనారాయణ వ్యవహారం తెలిసి మొదటి భార్య కేసు పెడతానని హెచ్చరించడంతో అతడు ఆమెతో కలిసి వెళ్లిపోయాడని తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై తమకు ఫిర్యాదు అందిందని.. పెళ్లి కుమార్తెకు న్యాయం చేస్తామని సీఐ నాగేశ్వర నాయక్ చెబుతున్నారు..”ఈ ఘటనపై మాకు ఫిర్యాదు అందింది.. పెళ్లి కుమార్తె తరఫు వారు మాకు అన్ని విషయాలు చెప్పారు. వారు చెప్పిన విషయాల ఆధారంగా ఫిర్యాదు స్వీకరించాం. అతనికోసం గాలింపు చేపడుతున్నాం. త్వరలోనే అతడిని పట్టుకొని పెళ్లి కుమార్తెకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని” సిఐ వెల్లడించారు.