Earth Quake: భూకంపం ఆయా ప్రాంతాల్లో సంభవించిందని ఎక్కువగా వింటుంటాం. నేడు తాజాగా భూకంపాన్ని తెలుగు ప్రజలు ఎక్స్‌పీరియన్స్ చేశారు. ఈ రోజు ఉదయం ఏపీ, తెలంగాణలో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. ములుగు జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల సమీపంలో రిక్టర్ స్కేలు తీవ్రతపై 5.3గా భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలకి ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందారు. సాధారణంగా భూకంపం సంభవిస్తే ప్రాణ, ఆస్తి తీవ్ర స్థాయిలో జరుగుతుంది. అయితే భూకంపం సంభవించే సమయంలో కొందరికి ఎలాంటి నియమాలు తెలియవు. వీటివల్ల కూడా ప్రమాదం పెరుగుతుంది. భూకంపం సమయంలో అసలు ఏం చేయాలో కూడా తెలియదు. ఆ నిమిషంలో అసలు మైండ్ కూడా పనిచేయదు. అయితే ఇలాంటి సమయంలోనే సమయస్ఫూర్తితో ఆలోచించాలని నిపుణులు అంటున్నారు. భూకంపం సంభవించే సమయంలో ప్రతీ ఒక్కరూ తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మరి అవేంటో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
ఇంటి లోపల ఉండకూడదు
భూకంపం సమయంలో అసలు ఇంటి లోపల ఉండకూడదు. ఎందుకంటే భూకంపం తీవ్రతకు ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల మరణించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంట్లోనే ఉంటే భారీగా ఉన్న ఫర్నీచర్ దగ్గర ఉండవద్దు. వీటికి దూరంగానే ఉండటం మంచిది. మీరు పై అంతస్థులో నివసిస్తుంటే కిందకు వెళ్లడం మంచిది. అలాగే కిందకు వెళ్లడానికి లిఫ్ట్ వంటివి వాడకూడదు. కేవలం మెట్లు మార్గంలో వెళ్లాలి. ఎందుకంటే లిఫ్ట్ అయితే మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది.
ఆందోళన చెందకూడదు
భూమి ఒక్కసారిగా కంపించినప్పుడు కొందరు ఆందోళన చెంది అరుస్తారు. ఇలా చేయడం వల్ల మీ చుట్టూ ఉన్నవారు భయపడతారు. అలాగే కొందరు పరిగెత్తడం, అరవడం, టెన్షన్ పడుతుంటారు. ఇలా చేయకుండా కదలకుండా ఒకే ప్లేస్‌లో ఉండాలి. ఆందోళనతో పరిగెత్తితే సమస్య పెద్దది అవుతుంది. కాబట్టి కదలకుండా ఒకే దగ్గర ఉండటం మంచిది.
గ్యాస్‌ను ఉపయోగించవద్దు
భూకంపం సమయంలో అగ్గిపెట్లు, లైటర్లు, గ్యాస్ వంటివి వాడకూడదు. వీటివల్ల గ్యాస్ లీక్ అయ్యి మొత్తం పేలిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో తీవ్ర స్థాయిలో ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి మంటల జోలికి ఈ సమయంలో వెళ్లవద్దు. పొరపాటున అగ్గిపుల్లను కూడా ముట్టించకూడదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ముట్టిస్తే ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉంటుందని నిపుణులు అంటున్నారు.
కిటికీల దగ్గరకు వెళ్లవద్దు
భూకంపం సంభవించిన సమయంలో కిటికీలు, విద్యుత్ వంటి వాటికి దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ సమయంలో కిటికీ అద్దాలు పగిలి అవి మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. విద్యుత్ అయితే షాక్‌ను కలిగిస్తాయి. వీటితో పాటు భారీ భవనాలు, చెట్లు వంటి వాటి దగ్గర కూడా ఉండకూడదు. విద్యుత్ తీగలను అసలు తాకకూడదు. వీటిని తాకడం వల్ల షాక్ కొట్టే ప్రమాదం ఉంది. భూకంపం తర్వాత వీటి ప్రమాద తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తప్పులు చేయవద్దు.