MLC Duvvada : వివాహేతర సంబంధాల వేళ.. దువ్వాడకు గట్టి షాక్ ఇచ్చిన జగన్.. ఇక కెరీర్ క్లోజ్ అయినట్టే

ఎట్టకేలకు వైసీపీ హై కమాండ్ స్పందించింది. దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ పై దృష్టి పెట్టింది. పార్టీ ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Written By: Dharma, Updated On : August 23, 2024 9:54 am

Duvvada Srinivasa Rao

Follow us on

MLC Duvvada : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు వైసీపీ షాక్ ఇచ్చింది. ఆయనను టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను తప్పించింది. ఆయన స్థానంలో పేరాడ తిలక్ కు ఆ బాధ్యతలను అప్పగించింది. ఇకపై నియోజకవర్గ పార్టీ వ్యవహారాలను సమన్వయ పరుస్తారని హై కమాండ్ స్పష్టం చేసింది. దీంతో దువ్వాడ శ్రీనివాస్ కు షాక్ తప్పలేదు. గత కొద్ది రోజులుగా దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దువ్వాడ ఒక మహిళతో సన్నిహితంగా ఉంటున్నారని ఆరోపిస్తూ ఆయన ఇంటి వద్ద భార్య వాణి తో పాటు కుమార్తెలు నిరసన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గత పది రోజులుగా ఈ రచ్చ నడుస్తోంది. మధ్యలో దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు మాధురి సైతం ఎంట్రీ ఇచ్చారు. దువ్వాడ ఇంట్లో నుంచి శ్రీనివాస్, ఇంటి బయట దువ్వాడ వాణి సైన్యం మొహరించగా.. మధ్యలో మాధురి సోషల్ మీడియా, మీడియా వేదికగా అనేక స్టేట్మెంట్లు ఇస్తూ రక్తి కట్టిస్తున్నారు. ఈ తరుణంలో వైసీపీ హై కమాండ్ కలుగజేసుకోకపోవడం పై రకరకాల విమర్శలు వచ్చాయి. దీనిపై జిల్లా నాయకత్వం సైతం ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితిని హై కమాండ్ కు వివరించింది. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా తో పాటు పార్టీ నుంచి దువ్వాడను సస్పెండ్ చేస్తారని అంతా భావించారు. కానీ కేవలం పార్టీ ఇన్చార్జి బాధ్యతల నుంచి దువ్వాడ శ్రీనివాసును తప్పించారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా కోరలేదు. పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. ఇది దువ్వాడ శ్రీనివాస్ కు కొంత ఉపశమనం కలిగించే విషయమే.

* రెండు వారాలుగా వివాదం
గత రెండు వారాలుగా టెక్కలి వేదికగా దువ్వాడ ఫ్యామిలీ వివాదం నడుస్తోంది. ప్రధానంగా దువ్వాడ కట్టించుకున్న కొత్త ఇంటిని టార్గెట్ చేసుకున్నారు. తొలుత ఆ ఇంటిని పిల్లల పేరిట రాయాలని వాణి డిమాండ్ చేశారు. తాను సైతం ఆ ఇంటి నిర్మాణానికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చానని మాధురి చెబుతున్నారు. అయితే అది తన స్వరార్జితం అని.. తన యావదాస్తిని పిల్లలకు రాసిచ్చానని.. తన తదనంతరం పిల్లలకు దక్కుతుంది కానీ.. ఆ ఇంటిని మాత్రం రాసి ఇవ్వనని దువ్వాడ తేల్చి చెప్పారు. తన రెండు కోట్లు ఇచ్చి దువ్వాడ వాణి అక్కడ ఉండవచ్చని మాధురి స్పష్టం చేశారు. మరోవైపు తనకు ఆస్తులు అక్కర్లేదని.. కుటుంబమంతా కలిసి ఉంటే చాలని వాణి చెప్పుకొస్తున్నారు. అయితే ఇంత జరిగాక కలిసి ఉండడం జరగని పని అని దువ్వాడ శ్రీనివాస్ తేల్చి చెబుతున్నారు.

* పొలిటికల్ కెరీర్ ముగిసినట్టే
ఈ ఎపిసోడ్ తో దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ కెరీర్ ముగిసినట్టే. కాంగ్రెస్ తో పాటు వైసీపీలో దువ్వాడ శ్రీనివాస్ కు ఛాన్స్ వచ్చింది. కానీ హరిచంద్రపురం తో పాటు టెక్కలి నియోజకవర్గం లో పోటీ చేయడం.. ఓడిపోవడం పరిపాటిగా మారింది. 1994 నుంచి దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేశారు. కానీ ఒక్కసారి కూడా గెలవలేదు. 2014లో టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దువ్వాడకు ఛాన్స్ ఇచ్చారు జగన్. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో ఎంపీగా పోటీ చేసినా ఓటమే పలకరించింది. ఈ ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ టిక్కెట్ ను కేటాయించారు జగన్. అయినా ఓటమి తప్పలేదు. ఇప్పుడు ఏకంగా నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యత నుంచి తప్పించారు.

* పార్టీకి నష్టమని నివేదికలు
ఇప్పటికే టెక్కలి నియోజకవర్గం వైసీపీ పార్టీ శ్రేణులు ఆందోళనతో ఉన్నాయి. దువ్వాడ శ్రీనివాసును కొనసాగిస్తే పార్టీకి నష్టమని నివేదికలు పంపాయి. దీంతో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లా నాయకత్వంతో సైతం దువ్వాడ శ్రీనివాస్ కు పొసగదు. కింజరాపు కుటుంబాన్ని ఢీకొట్టాలంటే దూకుడు కలిగిన దువ్వాడ అయితే బాగుంటుందని జగన్ భావించారు. జిల్లాలో అందరికంటే దువ్వాడ శ్రీనివాసులు ప్రోత్సహించారు. కానీ జగన్ ఇచ్చిన టాస్క్ ను పూర్తి చేయలేకపోయారు దువ్వాడ. కుటుంబ వివాదంలో చిక్కుకొని.. రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.