MLC Duvvada issue : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదానికి ఫుల్ స్టాప్ పడడం లేదు.రకరకాల పాత్రలు, పాత్రధారులు ప్రవేశిస్తుండడంతో సీరియల్ ఎపిసోడ్ గా మారుతోంది.తాజాగా దువ్వాడ ఇంట్లోకి నలుగురు ప్రవేశించారు.ఇంటి చుట్టూ వైసిపి ఫ్లెక్సీలు వెలిశాయి. ఇది దువ్వాడ నివాసం కాదు.ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయం అంటూ సంకేతం ఇచ్చేలా అక్కడ ఏర్పాట్లు జరిగాయి.అయినా సరే దువ్వాడ వాణి అక్కడే ఉంటూ ధర్నా చేస్తున్నారు. దాదాపు రెండు వారాల కిందట దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ ప్రారంభమైంది. తండ్రిని కలిసేందుకు దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు ఆ నూతన నివాసానికి చేరుకున్నారు. అయినా వారికి ఎంట్రీ లేకుండా పోయింది. అటు తరువాత దువ్వాడ వాణి ఎంటర్ అయ్యారు.నేరుగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి ఇద్దరు కుమార్తెలతో ప్రవేశించారు.బలవంతంగా తలుపులు తెరిచే ప్రయత్నం చేశారు.ఇంతలో అక్కడకు వచ్చిన దువ్వాడ శ్రీనివాస్ వారిపై దాడి చేసినంత ప్రయత్నం చేశారు. ఒక మహిళతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొని తమను దూరం పెట్టినట్లు దువ్వాడ వాణి తో పాటు కుమార్తెలు ఆరోపించారు.ఈ తరుణంలోనే దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు మాధురి ఎంట్రీ ఇచ్చారు.అప్పటినుంచి రచ్చ మరింత ముదిరింది. మీడియాలో ఇదే ప్రధాన వార్తగా మారింది.అనేక ట్విస్టులు,మలుపులు తిరుగుతూ రెండు వారాల పాటు తెలుగు ప్రజలకు వినోదాన్ని పంచింది.తనకు ఏ ఆస్తి అవసరం లేదని.. తన భర్తతో కలిసి ఉంటే అదే చాలు అని దువ్వాడ వాణి చెబుతుంటే.. ఇంత దాకా పరిస్థితి వచ్చింది కాబట్టి కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటానని దువ్వాడ శ్రీనివాస్ చెబుతున్నారు.
* ఆ ఇంటి పై తనకు హక్కు : మాధురి
మరోవైపు మాధురి సైతం తనకు ఆ ఇంటిపై హక్కు ఉందని.. తనకు చెల్లించాల్సిన రెండు కోట్ల రూపాయలు ఇచ్చి భర్తతో వాణి కలవవచ్చని మాధురి చెబుతున్నారు. అయితే దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారంతో వైసీపీకి డామేజ్ జరుగుతోందని.. అందుకే శ్రీనివాస్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని హై కమాండ్ కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే అటువంటిదేమీ లేకపోగా.. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇల్లు క్యాంప్ ఆఫీసుగా ముస్తాబు చేసుకోవడం విశేషం.
* హైకోర్టును ఆశ్రయించినా
తన ఇంటి వద్ద భార్య వాణి తో పాటు పిల్లలిద్దరూ బలవంతంగా ధర్నా చేస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.అయితే దీనిపై కోర్టుపోలీసులకు నోటీసులు ఇచ్చింది. వారి నుంచి వివరణ తీసుకునే ప్రయత్నం చేసింది. అయితే కోర్టు నుంచి సరైన మార్గదర్శకాలు రాలేదని భావించిన దువ్వాడ శ్రీనివాస్ తనకు రక్షణగా నలుగురు బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు. వారు విధుల్లో చేరారు. పైగా వైసీపీ ఫ్లెక్సీలతో ఇంటిని మొత్తం నింపేశారు. దీంతో ఇది పార్టీ కార్యాలయంగా చూపే ప్రయత్నం చేస్తున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి.
* బల ప్రదర్శన
అయితే రోజురోజుకు దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో బలప్రదర్శన పెరుగుతోంది. ఇంటి లోపల దువ్వాడ సేన, ఇంటి బయట దువ్వాడ వాణి సైన్యం మోహరించి ఉంది. మధ్యలో మీడియా హడావిడి సైతం అధికంగా ఉంది. ఇది పార్టీ క్యాంప్ ఆఫీస్ అని బోర్డు పెడితే భార్య అక్కడి నుంచి వెళ్ళిపోతుందని శ్రీనివాస్ భావిస్తున్నారు. కానీ దువ్వాడ వాణి అవేవీ పట్టించుకోవడం లేదు. అక్కడే నిరసన కొనసాగిస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎపిసోడ్ కు ఎండ్ కార్డు పడకపోగా.. రోజురోజుకు కవ్వింపు చర్యలతో మరింత జఠిలం అవుతోంది.