Amaravathi Capital  : డీపీఆర్ రెడీ.. అమరావతికి అనుసంధానంగా జంట నగరాల అభివృద్ధి..ఏపీ సర్కార్ ప్లాన్ ఇదీ

గత అనుభవాల దృష్ట్యా అమరావతి రాజధాని నిర్మాణాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. ఇందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. అదే సమయంలో విజయవాడ- గుంటూరు జంట నగరాల అభివృద్ధికి కూడా ప్రణాళిక రూపొందించింది.

Written By: Dharma, Updated On : August 28, 2024 3:48 pm

Amaravathi Dream Project

Follow us on

Amaravathi Capital : ఏపీలో కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిపై దృష్టి పెట్టింది. ఇప్పటికీ అక్కడ జంగిల్ క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లో అమరావతి యధా స్థానానికి రానుంది. మరోవైపు అక్కడ నిర్మాణాల విషయంలో నిపుణులు అధ్యయనం చేశారు. అవి పనికొస్తాయా? లేకుంటే పునర్నిర్మాణం జరపాలా? అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు డిసెంబర్ నుంచి అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రపంచ బ్యాంకు బృందం వచ్చి పరిశీలించింది. అక్టోబర్లో ఈ నిధుల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. ఇదే సమయంలో అమరావతి రాజధానిని అనుసంధానిస్తూ రోడ్డు, రవాణా మార్గాన్ని మరింత మెరుగుపరచాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. పలు రైల్వే లైన్లను అనుసంధానిస్తోంది. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంది. భూ సేకరణ నుంచి నిర్మాణం వరకు బాధ్యతలను నేషనల్ హైవే అథారిటీ తీసుకోనుంది. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణం తో పాటు విజయవాడ, గుంటూరు జంట నగరాల అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా విజయవాడ- గుంటూరు నగరాలకు కేంద్రం ఇప్పటికే రెండు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసింది. హైదరాబాద్ కు ధీటుగా జంట నగరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది.

* గ్రేటర్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ గా
ప్రధానంగా గుంటూరు కార్పొరేషన్.. గ్రేటర్ గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. గుంటూరు రూరల్ పరిధిలోని మండలాలను కలుపుతూ.. గ్రేటర్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనిపై కసరత్తు ప్రారంభమైంది. తాజా ప్రతిపాదనల మేరకు గుంటూరు కార్పొరేషన్ లో 8 మండలాల పరిధిలోని 39 గ్రామాలను విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయా పంచాయతీల్లో స్థానిక ప్రజాప్రతినిధుల పదవీకాలం పూర్తయిన తర్వాత వాటిని గ్రేటర్ గుంటూరులో కలపనున్నారు.

* ఆ మండలాలను కలుపుతూ
ప్రధానంగా గ్రేటర్ గుంటూరులో మేడికొండూరు మండలంలోని పేరేచర్ల, డోకిపర్రు, ఫిరంగిపురం మండలంలోని అమీనాబాద్, చేబ్రోలు మండలంలోని నారాకోడూరు, గొడవర్రు, గుండవరం, ప్రత్తిపాడు మండలంలోని చిన్న కొండ్రుపాడు, యనమదల, ఈదుల పాలెం కలవనున్నాయి. మరోవైపు తాడికొండ, వట్టి చెరుకూరు, పెదకాకాని, గుంటూరు రూరల్ మండలాలు గ్రేటర్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేర్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.

* ప్రపంచంలోనే గుర్తింపు
అమరావతి రాజధాని లో నవ నగరాలు నిర్మించాలన్నది చంద్రబాబు ప్లాన్. అందుకు అనుగుణంగా పనులు చేపట్టనున్నారు. అదే సమయంలో విజయవాడ- గుంటూరు నగరాలను అభివృద్ధి చేస్తే.. ఈ ప్రాంతం ప్రపంచానికే తలమానికమైన నగరాలు రూపొందుతాయి. పెట్టుబడుల స్వర్గధామం గా నిలుస్తాయి. ఆదిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. తాజా ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి డి పి ఆర్ తో కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. కచ్చితంగా అమరావతికి అనుసంధానంగా జంట నగరాల అభివృద్ధికి అవకాశం కలుగుతుంది. అదే జరిగితే ప్రపంచపుటల్లో అమరావతి రాజధాని ప్రత్యేకత సొంతం చేసుకోవడం ఖాయం.