Roja: సినీ రంగం నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టారు మంత్రి రోజా. తొలుత తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా పదవి చేపట్టారు. రెండుసార్లు టిడిపి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైసిపి ఆవిర్భావంతో ఆ పార్టీలోకి వెళ్లారు. 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు. విస్తరణ సమయంలో జగన్ ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు నగిరి నుంచి మూడోసారి వైసీపీ తరఫున పోటీ చేసేందుకు ఛాన్స్ ఇచ్చారు. అయితే రాజకీయాల్లోకి వచ్చాక, మంత్రి పదవి చేపట్టాక ఆమె ఆస్తులు పెరగడం విశేషం. తాజాగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లో తన ఆస్తిని రూ.10.63 కోట్లుగా చూపారు. అయితే ఐదేళ్లలో 47% ఆస్తులు పెరగడం హాట్ టాపిక్ గా మారింది.
ఓవైపు రాజకీయరంగంలో ఉంటూనే జబర్దస్త్ జడ్జిగా రోజా కొనసాగారు. కొన్ని ఛానళ్లలో స్పెషల్ షోలలో పాల్గొనే వారు. ఆర్థిక ఇబ్బందులతోనే రోజా అలా చేసేవారని సన్నిహితులు చెప్పేవారు. కానీ రోజా మంత్రి అయ్యాక టీవీ కార్యక్రమాల నుంచి తప్పుకున్నారు. కానీ ఆమె ఆదాయం పెరగడం విశేషం. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు.. ఇప్పుడు రూ.4.58కోట్లకు చేరుకున్నాయి. అప్పట్లో స్థిరాస్తులు రూ.4.64 కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ.6.05కోట్లకు చేరుకున్నాయి. ఈ ఐదేళ్లలో 81 లక్షల రూపాయలకు పెరిగాయి.
2019లో ఆరు కార్లు ఉండగా,ఒక బైకు ఉన్నట్లు అఫిడవిట్లో చూపారు.వాటి విలువ రూ.1.08 కోట్లు. ఇప్పుడు 9 కార్లు ఉన్నట్టు చూపారు. వాటి విలువ రూ.1.59కోట్లుగా పేర్కొన్నారు.అయితే 2019 నాటికంటే కార్ల విలువ ఇప్పుడు బాగా తగ్గించారు. ఐదేళ్లలో నగిరి నియోజకవర్గంలో భర్త పేరిట 6.39 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. గత ఎన్నికల సమయంలో రోజాపై నాలుగు కేసులు ఉండేవి. ఇప్పుడు ఒకటి కూడా లేకపోవడం విశేషం. ఆమె ఇంటర్ వరకు చదివినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. మరోవైపు మార్గదర్శి చిట్ఫండ్లో 40 లక్షల రూపాయల విలువచేసి చీటీ, మరో ప్రైవేటు స్థితిలోనూ ఆమెకు 32 లక్షల విలువైన మొత్తం ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తానికైతే ఈ ఐదేళ్లలో 47% ఆస్తులను రోజా పెంచుకున్నారు.