Botsa Satyanarayana: ఎమ్మెల్సీగా బొత్సను అనవసరంగా ఎంపిక చేశానని జగన్ భావిస్తున్నారా? మండలిలో విపక్ష నేతగా ముద్ర చూపించలేకపోతున్నారా? జగన్ అంచనాలను బొత్స అందుకోలేకపోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో వైసిపిలో నిరాశ అలుముకుంది. అందుకే శాసనమండలిలో ఉన్న మెజారిటీతో ఒక ఆట ఆడుకోవాలని జగన్ భావించారు. అనూహ్యంగా విశాఖ స్థానిక సంస్థల స్థానం నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు అవకాశం ఇచ్చారు. కూటమి అభ్యర్థిని పెట్టకపోవడంతో బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలి లో అడుగుపెట్టారు. అక్కడ ప్రతిపక్ష నేత అయ్యారు. అయితే సీనియర్ కావడంతోఆయన సేవలను శాసనమండలిలో ఉపయోగించుకోవాలని చూశారు జగన్.ఆయన ద్వారా టిడిపి దూకుడుకు బ్రేక్ వేయాలని భావించారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. బొత్స సత్యనారాయణ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. జగన్ లో ఇది అసహనానికి కారణమవుతున్నట్లు తెలుస్తోంది. టిడిపి సభ్యులను అక్కడ ఎదుర్కొనలేకపోతున్నారు. అధికార పక్షానికి అవకాశం ఇస్తున్నారు. దీంతో బొత్స వ్యవహారం ఏదో తేడాగా ఉంది అని తాడేపల్లిలో గుసగుసలు ప్రారంభమయ్యాయి.
* తిప్పి కొట్టడంలో ఫెయిల్
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు జరిగింది. దీంతో వైసిపి దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం ప్రారంభించింది. దానికి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది టిడిపి. మండలిలో చైర్మన్ గా వైసీపీకి చెందిన వ్యక్తి ఉన్న, వైసిపి పక్ష నేతగా సీనియర్ నేత బొత్స ఉన్న టిడిపి సభ్యులను మాత్రం తిప్పి కొట్టలేకపోయారట. గట్టిగా తమ వాదనలు వినిపించడంలో వైసీపీ సభ్యులు ఫెయిల్ అయ్యారు. నాటి వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను టిడిపి సభ్యులు ఎండగట్టారు. అవి హైలెట్ గా నిలిచాయి. అయితే ముఖ్యంగా లోకేష్ తల్లిని అవమానించారని టిడిపి నుంచి ఆరోపణలు రాగా.. అవి నిజమే అన్నట్టు మాట్లాడారు బొత్స. అటువంటి వారిని ప్రోత్సహించమని తేల్చి చెప్పగా.. తెరపైకి వచ్చిన అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. తామెప్పుడూ అవమానించలేదని చెప్పుకొచ్చారు. పుచ్చకాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఆయన అలా చెప్పేసరికి తెలుగుదేశం పార్టీకి అడ్డంగా బుక్ అయినట్లు అర్థమవుతోంది.
* ఆ కేసు విషయంలో వెనక్కి తగ్గారా?
అయితే ఓ కేసు విషయంలో బొత్స కూటమి ప్రభుత్వంతో రాజీ పడ్డారన్న అనుమానాలు వైసీపీ నుంచి వినిపిస్తున్నాయి. వైసిపి హయాంలో ఓ ఐఏఎస్ అధికారి విజయనగరం జిల్లాలో అడ్డగోలుగా భూములు ప్రైవేటు వ్యక్తులకు రాసుకొచ్చారు. సదరు అధికారికి బొత్స అండదండలు ఉన్నాయి. అదే విషయం ఇటీవల బయటపడింది. ఈ కేసు విషయంలో కూటమి ప్రభుత్వం పట్టు బిగిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో మండలిలో బొత్స తీరు అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఆయన కూటమి ప్రభుత్వంతో రాజీ పడ్డారా? అన్నా అనుమానం వైసీపీలో ఉంది. కానీ ఇప్పుడు ఏరి కోరి తెచ్చుకున్న బొత్సను ఏమీ అనలేని స్థితిలో వైసిపి ఉండడం విశేషం.