Ganta Srinivasa Rao: ఏపీలో కీలక నియోజకవర్గాల్లో భీమిలి ఒకటి. అక్కడ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తుండడంతో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపై పడింది.ఏ చిన్న లోపం వెలుగు చూసినా వైరల్ అవుతోంది.అయితే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఎన్నికల అఫిడవిట్ వివాదాస్పదంగా మారింది. ఆయన భార్య పాన్ కార్డు నెంబర్ మార్చి చూపడమే అందుకు కారణం. భీమిలి అసెంబ్లీ టికెట్ ను పట్టుబట్టి మరి గంటా శ్రీనివాసరావు సాధించుకున్నారు. అక్కడ ఎలాగైనా గెలవాలని గట్టి ప్రయత్నం లో ఉన్నారు. ఈ తరుణంలో ఎన్నికల అఫీడవిట్లో తప్పులు వెలుగు చూడడంతో ఈసీకి ఫిర్యాదు చేసేందుకు వైసిపి సిద్ధమయింది. గంటా పై ఈసీ సీరియస్ యాక్షన్ కు దిగుతుందని ప్రచారం జరుగుతోంది.
2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో ఎన్నికల అఫిడవిట్లో తన సతీమణి శారద పాన్ నెంబర్.. ఏబిపిపిజి 2215గా పేర్కొన్నారు.అయితే తాజాగా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా శుక్రవారం గంటా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈసారి తన సతీమణి శారద పాన్ కార్డు నెంబర్ ను ఏబిపిపిజి 2216 గా చూపడం విశేషం. అయితే తన భార్య పేరిట భారీగా ఆస్తులు కొనుగోలు చేయడం.. ప్రభుత్వానికి ఆదాయపు పన్ను కట్టకుండా మోసం చేయడం వంటి కారణాలతోనే తప్పుడు పాన్ కార్డు చూపారని ప్రచారం జరుగుతోంది.
ఆదాయపు పన్ను శాఖ చట్టం ప్రకారం రెండు లక్షల రూపాయలకు మించి నగదు లావాదేవీలు జరగకూడదు. అంతకుమించి చేస్తే అది నేరమే అవుతుంది. 2018లో గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉన్న సమయంలో భీమిలి నియోజకవర్గం లో పెద్ద ఎత్తున భూమిని కొనుగోలు చేశారు. అప్పట్లో 93 లక్షల వరకు నగదు రూపంలోనే చెల్లింపులు చేసినట్లు చూపించారు. ఇంతటి భారీ స్థాయిలో నగదు లావాదేవీలు జరిపితే పాన్ నెంబర్ను పేర్కొనడంతో పాటు ఐటీ రిటర్న్ లను దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే గంటా సతీమణి శారదా పేరుతో 2014 నుంచి 2019 వరకు ఏ సంవత్సరంలోనూ ఐటీ రిటర్న్ లను దాఖలు చేయలేదని తెలుస్తోంది. అయితే ఆమె రెండు పాన్ కార్డులను పొందారని.. అవి కూడా సీరియల్ గా ఉన్నాయని.. ఒకటి ఐటీ రిటర్న్ ల కోసం.. రెండోది భారీ నగదు లావాదేవీల కోసం వినియోగించినట్లు అనుమానాలు ఉన్నాయి. ఇలా రెండు పాన్ కార్డు నెంబర్లను కలిగి ఉండడం నేరమని.. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఎన్నికల ముంగిట గంటాకు పాన్ కార్డుల సెగ తగిలినట్లు అయ్యింది. ఇది ఎంతవరకు తీసుకెళ్తుందో చూడాలి.