Chandrababu gets angry: ప్రతిదీ పద్ధతి ప్రకారం జరగాలనుకుంటారు. ఏ విషయంలో కూడా నిర్లక్ష్యాన్ని ఒప్పుకోరు. అభివృద్ధి అనేది నిత్యం జరగాలని కోరుకుంటారు.. విపత్తులు ఎదురైనప్పుడు కంటి మీద కనుకు కూడా వేయరు. అవసరమైతే విపత్తులు జరిగిన చోటికి వెళ్లి ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే ఆయనలో చాలా ఉన్నాయి. చాలా ఉంటాయి. పై ఉపోద్ఘాతం చదువుతుంటే ఎవరికైనా సరే చంద్రబాబు పేరు గుర్తుకొస్తుంది.
తెలుగు ప్రజలకు ఐటీ అనే పదాన్ని పరిచయం చేసి.. ఈ రోజున బెంగళూరు తర్వాత హైదరాబాద్ ఉండేలా చేశారు. ఈ విషయంలో చాలామందికి అపోహలు ఉండొచ్చు. అనుమానాలు కూడా ఉండవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఆగ్రహం కూడా కలుగుతూ ఉండవచ్చు. కానీ, జరిగిన వాస్తవం, జరుగుతున్న యదార్థం మాత్రం అదే.
చంద్రబాబు తెలియని విషయాన్ని తెలుసుకోవాలనుకుంటారు. అదే క్రమంలో సుదీర్ఘ ఉపన్యాసాలను ఆయన ఒప్పుకోరు. విషయానుసారంగా మాట్లాడే ఆయన.. అధికారులు ఓవర్ స్మార్ట్ నెస్ ను ప్రదర్శిస్తే మాత్రం ఒప్పుకోరు. ఆ సమయంలో అధికారులను సున్నితంగా మందలిస్తారు. అంతకంటే ఎక్కువ చేస్తే మాత్రం ఆయన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు. కానీ చంద్రబాబు అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలను వేళ్ళ మీద లెక్కపెట్టుకోవచ్చు. కానీ, ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఒక సంఘటన పరిశీలిస్తే.. చంద్రబాబుకు కోపం తారాస్థాయిలో వచ్చింది. దీంతో ఆయన సదరు అధికారికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో ఓ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. అక్కడ ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దాని గురించి ఒక అధికారి ఉపన్యాసం లాగా వివరిస్తుండగా చంద్రబాబు వెంటనే స్పందించారు. నేను అడిగింది చెప్పండి చాలు. నాకు ఉపన్యాసం ఇవ్వద్దు. ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. ఇదంతా నేను చాలా సంవత్సరాలుగా చూస్తున్నదే. నేను చేస్తున్నదే” అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ వీడియోను వైసీపీ అనుకూల సోషల్ మీడియా గ్రూపులు నెగిటివ్ గా సర్కులేట్ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో చంద్రబాబు ఏం చేసినా సరే భూతద్దంలో పెట్టి చూడటం వైసీపీ సోషల్ మీడియాకు అలవాటుగా మారిపోయింది. పైగా వాటికి వక్ర భాష్యం చెప్పడం ఎక్కువైంది.