Kothakonda : చరిత్ర ఇదీ..కాకతీయుల కాలం నాటి ఈ దేవాలయం రాళ్ల మధ్య నిర్మించబడింది. ఇలాంటి శిలామయమైన ప్రదేశంలో కూడా ఐదు కొలనులు నిత్యం నీటితో నిండి ఉండటం స్వామి మహత్యంగా స్థానికులు చెప్పుకుంటారు. ఏటా జనవరిలో సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారిన సంక్రాంతి ముందు భోగి రోజున జాతర ఘట్టం ప్రారంభం అవుతుంది. ప్రధాన ఆకర్షణ సంక్రాంతి రోజున భక్తులు ఎడ్ల బండ్లలో వచ్చి మొక్కులు సమర్పిస్తారు. పుష్య బహుళ పంచమిన మొదలై 10 రోజులపాటు స్వామివారి కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు.
కళ్యాణోత్సవాలు ఇలా..
జనవరి 10న శ్రీ వీరభద్రస్వామి కల్యాణం ఉంటుంది. 11న గవ్యాతం, నిత్యోపాసన, నిత్యహోమం, నవగ్రహ హోమాలు, 12న బలిహరణ, సూర్యయంత్ర పతిష్టాపన, అరుణ పారాయణం, 13న ఏకాదశి రుద్రహోమం, 14న భోగి రోజున చండీహోమం, వేదపారాయణం, 15న బండ్లు తిరుగుట (జాతర), శత రుద్రాభిషేకం, ఉత్తరాయణ పుణ్యకాల పూజ, 16న నాగవెల్లి, వసంతోత్సవం, 17న గణపతి పూజ, స్వామివారి త్రిశూల స్నానం, 18న అగ్నిగుండాలు అనంతరం స్వామివారి గ్రామ పర్యటన జాతరలో ముఖ్య ఘట్టాలుగా ఉంటాయి. గండాలు తీరేందుకు గండదీపం వెలిగించడం, వీరభద్రునికి వెండి, బంగారంతో చేసిన కోరమీసాలు సమర్పిస్తే కోరిన కోరికలు తీరుస్తారని భక్తుల నమ్మకం. వీరశైవులు ఖడ్గాలు ధరించి ప్రభలు బీరభద్రపల్లెరం చేస్తారు. స్వామి వారిని వైశ్యులు వారి ఇలవేల్పుగా పూజిస్తారు. ప్రతి శ్రావణ మాసంలో వందలాది మంది భక్తులు స్వామివారి మాలను ధరించి 27 రోజులు దీక్షలు చేపడతారు.
సంతానయోగం
ఇక్కడి వీరభద్రస్వామికి ప్రత్యేక మహిమలు ఉన్నట్లు భక్తుల నమ్మకం. సంతానం లేనివారు స్వామి వారికి కోరమీసాలు సమర్పించు కుంటే పుత్రసంతానం కలుగుతుందని, కోడెను కట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చేసిన పాపాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు. కోడెలు కట్టటం, అభిషేకాలు, అర్చనలు, అష్టోత్తరాలు, అమ్మ వారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, నవగ్రహ పూజలు, ఆంజనేయునికి ఆకుపూజలు, చందనోత్సవాలు మొదలైనవి భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.
ఇక్కడికి చేరుకోవడం ఇలా..
కరీంనగర్ నుంచి వచ్చే వారు హుజురాబాద్, హుస్నాబాద్ మీదుగా చేరుకోవచ్చు.
హన్మకొండ, హైదరాబాద్ నుంచి వచ్చే వారు మడికొండ, వేలేరు మీదుగా చేరుకోవచ్చు.
ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు..
ఇక్కడికి వెళ్లేందుకు జాతర సమయంలో ఆర్టీసీ కరీంనగర్, హన్మకొండ, హుజురాబాద్, హుస్నాబాద్ నుంచి ప్రత్యేక సర్వీసులను నడుపుతుంది.