AP Elections 2024: నగదు, మద్యం, డ్రగ్స్ కు అంతే లేదా.. ఏపీలో పట్టుబడింది ఎంతో తెలుసా?

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలైన ఒడిస్సా, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోపోలీస్ శాఖ ప్రత్యేక పోస్టులను ఏర్పాటు చేసింది.

Written By: Dharma, Updated On : May 30, 2024 9:49 am

AP Elections 2024

Follow us on

AP Elections 2024: ఎన్నికలు అన్నాక మద్యం, నగదు సర్వసాధారణం అయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున నగదు పంపకాలు జరిగాయి.మద్యం ఏరులై ప్రవహించింది.ముఖ్యంగా ఏపీలో అయితే పెద్ద ఎత్తున నగదు పట్టుబడింది. మద్యంతో పాటు డ్రగ్స్ పట్టుబడటం విశేషం. 2019 ఎన్నికలతో పోల్చుకుంటే రెట్టింపు పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ శాఖ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. పట్టుబడిన నగదు మద్యం వివరాలను వెల్లడించింది.

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలైన ఒడిస్సా, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోపోలీస్ శాఖ ప్రత్యేక పోస్టులను ఏర్పాటు చేసింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో,రెవెన్యూ శాఖ,వాణిజ్య పన్నుల శాఖ, రెవెన్యూ శాఖల సహకారంతో దాడులు చేసినట్లు వివరించింది. మొత్తం 150 బోర్డర్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. 35 పెట్రోలింగ్ టీములు, 15 తాత్కాలిక చెక్ పోస్టుల ద్వారా తనిఖీలు ముమ్మరం చేసి పెద్ద ఎత్తున నగదు, మద్యం, డ్రగ్స్ పట్టుకున్నట్లు పోలీస్ శాఖ వెల్లడించింది.ఎన్నికల్లో మొత్తం 3466 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపింది.

2019 ఎన్నికల్లో రూ.41.08కోట్లు స్వాధీనం చేసుకోగా.. ఎన్నికల్లో ఏకంగా రూ.107.9 కోట్లను సీజ్ చేశారు.7309 మందిని అరెస్టు చేశారు.2019 ఎన్నికల్లో రూ.8.97కోట్ల విలువైన మద్యాన్ని పట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో ఏకంగా రూ.58.70 కోట్ల మద్యాన్ని సీజ్ చేయడం విశేషం. 2019 ఎన్నికల్లో రూ.5.4కోట్ల డ్రగ్స్ పట్టుబడింది. ఈ ఎన్నికల్లో మాత్రం రూ.35.16 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 1730 మందిని అరెస్టు చేశారు.2019 ఎన్నికల్లో రూ.10.60 కోట్ల విలువైన ఉచిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో మాత్రం రూ.16.98 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి 233 మందిని అరెస్టు చేసినట్లు పోలీస్ శాఖ ధ్రువీకరించింది. మొత్తానికైతే గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున నగదు, మద్యం పట్టుబడడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.