Vijayawada: విజయవాడ ప్రజలకు గుడ్ న్యూస్. విజయవాడ నుంచి నేరుగా దుబాయ్ కు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు అరబ్ ఎమిరేట్స్ అధ్యయనం చేస్తోంది. అందులో భాగంగా ఆ సంస్థ ప్రతినిధులు ఇటీవల విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు. ఎయిర్పోర్టులోని టెర్మినళ్ళను పరిశీలించి.. ఎయిర్ ట్రాఫిక్ ఎలా ఉంటుందనే వివరాలు తెలుసుకున్నారు. త్వరలో దుబాయ్ కి విమాన సర్వీసులు నడిచేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి విజయవాడ నుంచి నేరుగా దుబాయ్ విమానాలు అందుబాటులో లేవు. దుబాయ్ వెళ్లాలంటే కచ్చితంగా హైదరాబాద్ వెళ్ళాలి. ఇప్పుడు ఆ అవసరం లేకుండా విజయవాడ నుంచి నేరుగా దుబాయ్ కి నేరుగా విమాన సర్వీసులు ఏర్పాటు చేయాలని భావిస్తుంది అరబ్ ఎమిరేట్స్ ఎయిర్లైన్స్.
* ఎయిర్ పోర్ట్ సందర్శన
ఇటీవల అరబ్ ఎమిరేట్స్ సంస్థ ప్రతినిధులు విజయవాడ విమానాశ్రయాన్ని సందర్శించారు. అక్కడ డైరెక్టర్ లక్ష్మీకాంత రెడ్డితో సంప్రదింపులు జరిపారు. విజయవాడ నుంచి దుబాయ్ కు ఎంత మంది ప్రయాణికులు వెళ్తుంటారు? ఇక్కడ ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంటుంది? అంటూ ఆరా తీశారు. విజయవాడ ఎయిర్పోర్ట్ లో ఉన్న ఇంటీరియం టెర్మినల్ బిల్డింగ్ను పరిశీలించారు. టెర్మినల్ కూడా సందర్శించారు. నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
* మరో ఆరు నెలల్లో కొత్త టెర్మినల్
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మరో ఆరు నెలల్లో పూర్తి కానుంది. దీని గురించి కూడా ఎమిరేట్స్ ప్రతినిధులు వివరాలు తెలుసుకున్నారు. అయితే విజయవాడ దుబాయ్ విమాన సర్వీసులు ప్రారంభం పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఎమిరేట్స్ సంస్థ స్వంతంగా జరుగుతున్న సర్వే పూర్తయిన తరువాత ఈ విషయంలో క్లారిటీ రానుంది.
* గతంలో ఇదే ప్రతిపాదన
వాస్తవానికి టిడిపి ప్రభుత్వ హయాంలో గతంలోనే దుబాయ్ కు విమాన సర్వీసులు నడపాలని నిర్ణయించారు. ఈ విషయంపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టారు. ఎక్కువమంది ఈ ప్రాంత ప్రజలు దుబాయ్ సర్వీసులు కావాలని విజ్ఞప్తి కూడా చేశారు. దీంతో వయబులిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా విజయవాడ దుబాయ్ విమాన సర్వీసులు నడపాలని నిర్ణయించారు. కానీ ఎందుకో ఆ తరువాత ఇది మరుగున పడిపోయింది. ఇప్పుడు మరోసారి కూటమి అధికారంలోకి రావడం.. పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉండడంతో.. మళ్లీ కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. అయితే పూర్తిస్థాయి సర్వే జరిగిన తరువాత అరబ్ ఎమిరేట్స్ విమాన సర్వీసులపై ప్రత్యేక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.