Y V Subba Reddy: ఉత్తరాంధ్ర వైసీపీలో విభేదాల పర్వం వణుకు పుట్టిస్తోంది. ఇక్కడ వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. దాదాపు ప్రతి నియోజకవర్గంలో అధికార పార్టీలో విభేదాలు కొనసాగుతున్నాయి. వాటిని నియంత్రించడంలో నాయకత్వం విఫలమవుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర రీజినల్ ఇంచార్జ్ వైవి సుబ్బారెడ్డి ఆశించిన స్థాయిలో పని చేయలేకపోతున్నారు. ఆయన నేతృత్వంలో వరుస వైఫల్యాలతో పాటు నేతలు పార్టీని వీడుతున్నారు. ఇది అధికార పార్టీకి కలవరపాటుకు గురి చేసే విషయం. విశాఖలో పాలన రాజధాని పెడతామని వైసిపి ప్రకటించి… ఆర్భాటం చేస్తున్నా ప్రజలు పెద్దగా విశ్వసించడం లేదు. ఆ నిర్ణయాన్ని స్వాగతించడం లేదు.
వై వి సుబ్బారెడ్డి ఇన్చార్జిగా మారిన తర్వాత ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. కానీ అనూహ్యంగా ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి గెలుపొందారు. అక్కడి నుంచి వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడుగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు ఏకంగా పార్టీని వీడారు. జనసేనలో చేరారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సైతం జనసేన లో చేరతారని ప్రచారం జరుగుతోంది. గాజువాక ఎమ్మెల్యే కుమారుడు సైతం పార్టీకి దూరమయ్యారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన కుమారుడు రత్నాకర్ సైతం అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. గత ఎన్నికల్లో టిడిపి తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ ను వైసీపీలోకి రప్పించారు. అప్పట్లో టిక్కెట్ హామీ తోనే ఆయన వైసీపీలో చేరారు. ఇప్పుడు రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. సీతం రాజు సుధాకర్, దివంగత ద్రోణంరా జు శ్రీనివాస్ కుమారుడు తదితరులు అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. ఆశావాహులను పిలిచి మాట్లాడడంలో వైవి విఫలమయ్యారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అది మరవకముందే విశాఖ తూర్పు నియోజకవర్గ వివాదం కూడా బయటపడింది. విశాఖ సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను తూర్పు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. దీంతో ముందు నుంచి అక్కడ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న నేతలు పునరాలోచనలో పడ్డారు. పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధపడ్డారు.
సమన్వయ బాధ్యతలను పూర్తి చేయడంలో వైవి విఫలమయ్యారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో విజయసాయిరెడ్డి ఉండేటప్పుడు ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతంగా కనిపించేది. నాయకుల మధ్య విభేదాలు తలెత్తితే ఆయన చొరవచూపి పరిష్కరించేవారు. కఠినంగా వ్యవహరించేవారు. వై వి సుబ్బారెడ్డి స్థానికంగా ఉండడం లేదు. హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అందుకే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు పట్టుమని మూడు నెలల వ్యవధి కూడా లేదు. ఈ సమయంలో సమన్వయ బాధ్యతలు సక్రమంగా చూసుకోకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వై వి విషయంలో హై కమాండ్ సకాలంలో రియాక్ట్ కావాలని.. లేకుంటే మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నాయి.