Kodali Nani Latest News: వైసీపీ( YSR Congress party) హయాంలో కొడాలి నాని వాయిస్ బలంగా వినిపించేది. అయితే అదేదో ఆయన నిర్వర్తించిన శాఖకు సంబంధించినది కాదు. ఈ రాష్ట్ర సమస్యలపై అంతకంటే కాదు. నందమూరి కుటుంబం పేరు చెప్పుకుంటూ నారా కుటుంబాన్ని టార్గెట్ చేయడం నానికి అలవాటైన విద్యగా మారిపోయింది. నాడు టిడిపి ప్రజా సమస్యలపై పోరాటం ప్రారంభిస్తే.. కొడాలి నాని మాత్రం నందమూరి కుటుంబానికి నారా కుటుంబం అన్యాయం చేసిందని.. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని చెబుతూ చివరకు.. జూనియర్ ఎన్టీఆర్కు అన్యాయం చేశారని ముగించేవారు కొడాలి నాని. అటువంటి కొడాలి నాని పై సగటు టిడిపి అభిమాని ఆగ్రహంగా ఉండేవారు. కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే కొడాలి నాని అరెస్టు ఉంటుందని భావించారు. కానీ అటువంటిదేమీ జరగలేదు.
చంద్రబాబు కుటుంబమే టార్గెట్..
కొడాలి నాని ( Kodali Nani )నోటికి చంద్రబాబు కుటుంబమంతా బలి అయ్యేది. వాడు వీడు అంటూ చంద్రబాబు పై ప్రయోగించే భాష చెవులకు ఇబ్బందిగా ఉండేది. లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడేవారు. హద్దులు దాటి మాట్లాడేవారు. సగటు టిడిపి అభిమాని అయితే కొడాలి నాని పై ప్రతీకార వాంఛతో రగిలిపోయేవారు. చంద్రబాబు అరెస్టు సమయంలో మానవత్వం మరిచి చేసిన వ్యాఖ్యలను విన్నవారి రక్తం మరిగిపోయేది. అంతలా ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసిన కొడాలి నాని తప్పకుండా మూల్యం చెల్లించుకోవాలని సగటు టిడిపి అభిమాని బలంగా కోరుకునేవారు.
జగన్ ప్రోత్సాహంతోనే..
జగన్ ( Y S Jagan Mohan Reddy ) కళ్ళలో ఆనందం కోసం కొడాలి నాని ఆ వ్యాఖ్యలు చేసేవారు. అయితే ఆనందం మాట పక్కన ఉంచితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యానికి, ఫలితాలకు కూడా కొడాలి నాని వంటి వారు ప్రధాన కారణం. గుడివాడ కొడాలి నాని అడ్డా.. దమ్ముంటే రండిరా అంటూ జగన్ ప్రోత్సాహంతో రెచ్చిపోయేవారు కొడాలి నాని. విపరీతమైన విజయగర్వంతో, అహంకారపూరిత మాటలతో ఐదేళ్లపాటు టిడిపి శ్రేణులను చుక్కలు చూపించారు. పద్ధతి లేని మాటలతో, బూతు వ్యాఖ్యలతో జగన్మోహన్ రెడ్డిని ఆకట్టుకున్నారు. టిడిపి శ్రేణులకు వ్యతిరేకంగా మారిపోయారు. 18 నెలల కిందట అధికారంలోకి వచ్చిన టిడిపి శ్రేణులు నాని అరెస్టును కోరుకున్నాయి కానీ అది జరగలేదు.
వంశీని అరెస్టు చేసి..
వల్లభనేని వంశీ మోహన్ కు( Vamsi Mohan ) మించి కొడాలి నాని మాట్లాడేవారు. అయితే వంశీ మోహన్ ను అరెస్టు చేసి ఉంచినప్పుడు ఆయనపై సానుభూతి లభించలేదు. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకున్నారు కూడా. అయితే ఇప్పటికీ కొడాలి నాని మాటలు విని.. చేతలు చూసిన టిడిపి శ్రేణులు కొడాలి నాని అరెస్టు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నాయి. ఆయన విషయంలో ఎందుకు ఉపేక్షిస్తున్నట్టు అని అనుమానం ఒకటి కలుగుతోంది. అయితే గుడివాడ జంక్షన్ లో కొట్టుకొని తీసుకెళ్దాం అంటూ రెడ్ బుక్కును గుర్తుపెట్టుకొని మాట్లాడారు లోకేష్. కానీ అటువంటిదేమీ కనిపించకపోవడంతో కొడాలి నాని క్షమించేసారని నాయకత్వం పై టిడిపి శ్రేణులు అనుమానిస్తున్నాయి.