Chandrababu Naidu: ఏపీలో ఎన్నికల వాతావరణం రోజుకు రంజుగా మారుతోంది. అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ.. రేపోమాపో ఎన్నికలన్నట్టుగా అక్కడ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘానికి వైసిపి ప్రభుత్వం నియమించిన వలంటీర్లపై తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. ఫలితంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయొద్దని ఆదేశించింది. ఫలితంగా ఏపీ వ్యాప్తంగా ఈనెల పింఛన్ల పంపిణీ నిలిచిపోయింది. దీంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు పింఛన్ కోసం పడిగాపులు కాస్తున్నారు. పంచాయతీ కార్యాలయం ఎదుట బారులు తీరి కనిపిస్తున్నారు. కొన్నిచోట్ల పింఛన్లు సరిగా అందక వృద్ధులు చనిపోయారనే వార్తలు కూడా వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ లేఖ రాయడంతోనే ఎన్నికల సంఘం స్పందించిందని.. ఫలితంగా లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ నిలిచిపోయిందని.. వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రకరకాల మీమ్స్ సృష్టించి హల్ చల్ చేస్తున్నారు.
ఎన్నికల సమయం కావడంతో.. వైసీపీ అనుకూల సోషల్ మీడియా నెటిజన్లు బహుళ ప్రజాదరణ పొందిన సినిమాలను తమ ప్రచారానికి అనువుగా వాడుకుంటున్నారు. ఎన్టీఆర్ యమదొంగ, మహేష్ బాబు టక్కరి దొంగ, చిరంజీవి కొండవీటి దొంగ, చంద్రబాబు పింఛన్ల దొంగ అంటూ సంబోధిస్తూ మీమ్ రూపొందించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి మీమ్స్ ను వైసిపి అనుకూల సోషల్ మీడియా విభాగం తెగ ప్రచారం చేస్తోంది.. ఎన్నికల సమయం కావడంతో ఇలాంటి మీమ్స్ పై నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు.
వైసిపి ఇలా ప్రచారం చేస్తే.. టిడిపి మరో పంథాను అనుసరిస్తున్నది..”పవన్ కళ్యాణ్ సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్ల దగ్గర ఎంఆర్ఓ లతో టికెట్లు పంపిణీ చేయించారు. కరోనా సమయంలో మద్యం దుకాణాల వద్ద రెవెన్యూ అధికారులతో పని చేయించారు. కానీ ఇప్పుడు వలంటీర్లను వద్దు అనగానే పింఛన్ల పంపిణీ నిలిపివేశారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటే పింఛన్లు ఎందుకు పంపిణీ చేయడం లేదు. డబ్బులను మొత్తం వేరే మార్గాలకు మళ్ళించారు. అందువల్లే వృద్ధులకు ఈనెల పింఛన్లు రాలేదు.. కానీ ఈ విషయాన్ని ప్రభుత్వం మాపై నెడుతోంది” అంటూ టిడిపి నాయకులు అంటున్నారు.

పార్టీల గొడవ ఇలా ఉంటే.. ఏపీలో లబ్ధిదారుల బాధ మరో విధంగా ఉంది. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేసేవారు. ప్రతినెల ఒకటో తేదీన ఇంటికి వెళ్లి మరీ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఎన్నికల సంఘం వల్ల పింఛన్ల పంపిణీ నిలిచిపోయింది.. ఫలితంగా వారు మందులకు, ఇతర అవసరాలకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ సచివాలయాల ఎదుట బారులు తీరి కనిపిస్తున్నారు. కొన్నిచోట్ల వృద్ధులు చనిపోయారనే వార్తలు కూడా వచ్చాయి. మరి ఇలాంటి సమయంలో ఎన్నికల సంఘం లబ్ధిదారుల కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.