Dharmana-Jagan: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో ఇటీవల సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు యాక్టివ్ అయ్యారు. అయితే ఆయన ఓటమి నుంచి చేరుకోవడానికి ఏడాదికి పైగా పట్టింది. అయితే ఒకే ఒక షరతుతో ఆయన పార్టీలో యాక్టివ్ అయినట్లు ప్రచారం నడుస్తోంది. సుదీర్ఘకాలం ఉమ్మడి ఏపీలో రాజకీయాలు చేశారు ధర్మాన ప్రసాదరావు. అయితే గత ఎన్నికల్లో ఒక సామాన్య సర్పంచి చేతిలో ఓడిపోయారు. అది మొదలు తీవ్ర నైరాస్యంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు ఉన్నఫళంగా యాక్టివ్ అయ్యారు. దీంతో రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆది నుంచి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆయన భిన్న వైఖరి అనుసరిస్తూ వచ్చారు. ఒకానొక దశలో పార్టీకి దూరమవుతారని ప్రచారం నడిచింది. కానీ కూటమిలో ఆప్షన్ లేకపోవడంతోనే ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారని తెలుస్తోంది.
పుష్కరకాలం ఏకధాటిగా..
ఉమ్మడి రాష్ట్రంలోనే ఏకధాటిగా 12 సంవత్సరాలపాటు మంత్రిగా ఉన్నారు ధర్మాన ప్రసాదరావు( dharmana Prasad Rao ). పైగా రెవెన్యూ లాంటి కీలక శాఖ బాధ్యతలను చూశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమయంలో కాంగ్రెస్ మంత్రిగా ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే 2014 లో గత్యంతరం లేని స్థితిలో ఆయన జగన్ చెంతకు వెళ్లారు. అయినా ఓటమి పలకరించింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న వేవ్ దృష్ట్యా చాలా యాక్టివ్ గా పని చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో తనకు మంత్రి పదవి ఖాయమని అంచనా వేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. సోదరుడు కృష్ణదాస్కు ఇవ్వడంతో తీవ్ర మనస్థాపంతో మూడేళ్లపాటు గడిపారు. దీంతో విస్తరణలో ధర్మాన ప్రసాదరావు కు ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్ విషయంలో విభిన్న వైఖరితో ఉన్న ధర్మాన మంత్రిగా తన మార్కు చూపించుకోలేకపోయారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయేసరికి జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు ముందుకు రాలేదు కూడా.
కుమారుడు భవిష్యత్తు కోసమే..
అయితే ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయ్యారు ధర్మాన ప్రసాదరావు. అయితే ఈ యాక్టివ్ వెనుక కుమారుడు రామ్ మనోహర్ నాయుడు భవితవ్యం ఉన్నట్లు తేలుతోంది. 2024 ఎన్నికల్లోనే తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని కోరారు ధర్మాన ప్రసాదరావు. అందుకు జగన్ అంగీకరించలేదు. ఎన్నికల్లో ఓడిపోవడంతో శ్రీకాకుళం నియోజకవర్గంలో వైసిపి గెలుపు కష్టం అన్న ఆలోచనకు వచ్చారు. పార్టీ ఆవిర్భవించి మూడుసార్లు ఎన్నికలు జరిగితే ఒకసారి మాత్రమే గెలిచింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. 2024 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో టిడిపి అభ్యర్థి 52,000 ఓట్ల తేడాతో గెలిచారు. అంటే ఏ స్థాయిలో ఇక్కడ తెలుగుదేశం అనుకూల వాతావరణం ఉందో గ్రహించారు ధర్మాన ప్రసాదరావు. అందుకే టిడిపి తో పాటు కూటమి పార్టీలో చేరేందుకు ప్రయత్నించారు. అది వర్కౌట్ కాకపోవడంతో వైసీపీలో కొనసాగుతున్నట్లు విశ్లేషణలు ఉన్నాయి.
గట్టిగానే హెచ్చరించడంతో..
అయితే ధర్మాన ప్రసాదరావు విషయంలో పార్టీ హైకమాండ్ అల్టిమేట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో కొనసాగుతారా? లేదా? లేకుంటే ప్రత్యామ్నాయం చూసుకోమంటారా? అని గట్టిగానే కోరినట్లు తెలుస్తోంది. అప్పుడే ధర్మాన ప్రసాదరావు ఒక షరతు పెట్టినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు రామ్ మనోహర్ నాయుడు కు టికెట్ ఇస్తే పార్టీలో యాక్టివ్ అవుతానని ధర్మాన ప్రసాదరావు చెప్పినట్లు తెలుస్తోంది. అధినేత జగన్మోహన్ రెడ్డి అంగీకరించడంతోనే ధర్మాన యాక్టివ్ అయినట్లు సమాచారం. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.