YSRCP Land Titling Act: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నాయకులు ఇంకా గుణపాఠం నేర్చుకోవడం లేదు. మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఫలితాలను విశ్లేషించుకోవడం లేదు. తమకు 40 శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి మరోసారి అధికారంలోకి వస్తామని భావిస్తున్నారు. తమకు ఎదురైన ఓటమిపై పోస్టుమార్టం నిర్వహించుకోవడం లేదు. ముఖ్యంగా దేనితో తమకు ఓటమి ఎదురయిందో అన్న ఆలోచన చేయడం లేదు. తిరిగి వితండ వాదన చేస్తున్నారు. చివరకు ఆ పార్టీ సీనియర్లు సైతం తమకు ఎదురైన పరాభవాలను, పరిస్థితులపై ఆలోచన చేయడం లేదు. ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టానికి గురిచేసింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. పొలంలో ఉన్న సరిహద్దు రాళ్లపై జగన్ ఫోటోలు, పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలు అనేవి ఆ పార్టీకి మైనస్ గా మారాయి. చాలా నష్టం చేకూర్చాయి.
ప్రజలు కన్నెర్ర..
ప్రజలు దేనినైనా సహిస్తారు కానీ తమ సొంత భూముల విషయంలో ప్రభుత్వాలు కలుగజేసుకుంటే కన్నెర్ర చేస్తారు. ఇప్పుడు మొన్న 2024 ఎన్నికల్లో కూడా అదే స్పష్టమైంది. దశాబ్దాలుగా పట్టాదారు పాసుపుస్తకాలపై ప్రభుత్వ రాజముద్రతో కూడిన ఫోటో మాత్రమే ఉంటుంది. అది కూడా ప్రభుత్వ లోగో. తమ భూములకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది అన్నది ప్రజల నమ్మకం. అటువంటి పట్టాదారు పాసుపుస్తకం పై జగన్ ఫోటో ముద్రించడం అనేది అత్యంత అభ్యంతరకరం. అందుకే ప్రజలు ఎక్కువగా ఆగ్రహించారు. తమ భూములపై జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకని ప్రశ్నించినా పట్టించుకోలేదు జగన్ సర్కార్. చాలా రకాలుగా అనుమానాలు వ్యక్తం చేసినా పెడచెవిన పెట్టింది. అందుకే దారుణ ఓటమి ఎదురయింది.
సీనియర్ నేతలకు తగునా?
అయితే ఇప్పుడు అంతటి పరాభవానికి కారణమైన పట్టాదారు పాసు పుస్తకాలపై ఫోటో విషయంలో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉండడమే మేలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్( land titling act ) అనేది తమ తప్పిదం కాదని.. అదంతా అప్పటి బిజెపి ప్రభుత్వ తప్పిదం అని ధర్మాన ప్రసాదరావు లాంటి సీనియర్లు అనడం ఎంత మాత్రం సహేతుకం కాదు. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న ఆయన అది తప్పు అని జగన్మోహన్ రెడ్డికి చెప్పలేకపోయారు. ప్రజల వ్యక్తిగత ఆస్తుల జోలికి వెళితే వారు ఊరుకోరు అని కూడా చెప్పలేకపోయారు. వాస్తవానికి ధర్మాన ప్రసాదరావు లాంటి సీనియర్ నేత కూడా.. ఒక సాధారణ సర్పంచ్ చేతిలో 52 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు అంటే ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉందో గుర్తించలేకపోయారు. దానిని మరిచి మాది తప్పు కాదని మళ్లీ జగన్మోహన్ రెడ్డికి వెనుకేసుకొస్తున్నారు. ఒక్క సర్వే రాళ్లు తొలగించడం.. వాటిపై జగన్ ఫోటోను తొలగించడానికి 700 కోట్ల రూపాయల ఖర్చు జరిగింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రజలు ఏదైనా చెబితే నమ్మేస్తారు అనడం చాలా పొరపాటు. ఇకనైనా ఆ బొమ్మల విషయంలో వైసీపీ సైలెంట్ గా ఉంటేనే మంచిది