Pawan Kalyan : ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్నారు.ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చలు జరుపుతున్నారు.ఈ క్రమంలో వైసిపి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాని వ్యవహారం పై ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. పోలీసులను వారి పని వారిని చేసుకోనివ్వాలని.. తన పని తాను చేస్తానని పవన్ వ్యాఖ్యానించారు. ఏపీలో హోంశాఖ తో పాటు శాంతిభద్రతలు తన పరిధిలో లేవని చెప్పారు. గత ఐదేళ్లుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని ఎందుకు పట్టించుకోవట్లేదని మీడియా అడిగిందని.. ఇదే విషయం పై సైతం సీఎం దృష్టికి తీసుకెళ్తానని తేల్చి చెప్పారు పవన్. గత ప్రభుత్వ పాలన బాధ్యతాయుతంగా జరగలేదని గుర్తు చేశారు. కేంద్ర జల శక్తి మంత్రి సి ఆర్ పాటిల్ తో పవన్ సమావేశం అయ్యారు. పోలవరం తో పాటు ఏపీలో నదుల అనుసంధానం ప్రక్రియ పై చర్చించారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో సైతం కీలక చర్చలు జరిపారు.
* అంబేద్కర్ మాటలతో ట్వీట్
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శాంతి భద్రతల అవసరాన్ని గుర్తుచేస్తూ పవన్ కళ్యాణ్ ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.పవన్ శాంతి భద్రతలపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన మాటలను గుర్తు చేశారు. ‘లా అండ్ ఆర్డర్ అనేది శారీర రాజకీయాలకు ఔషధం మరియు శరీర రాజకీయాలు అనారోగ్యం పాలైనప్పుడు,ఔషధం తప్పనిసరిగా ఇవ్వాల్సిందే’ అంటూ ఈ ట్విట్ లో రాసుకొచ్చారు. గతంలో శాంతిభద్రతలపై పలు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు పెట్టిన ఈ ట్విట్ ఎవరి గురించి పెట్టారన్నది చర్చగా మారింది. అయితే కాసేపటికి ఈ ట్విట్ డిలీట్ చేశారు పవన్.
* సమోసా ఖర్చు రూ.9 కోట్లు
మరోవైపు రాంగోపాల్ వర్మతో పాటు మరికొందరి అరెస్టుపై ఇన్ డైరెక్ట్ గా మాట్లాడారు పవన్. పోలీసులు వారి పనిని వారిని చేయనివ్వండి.. నా పని నేను చేస్తానంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు గత వైసిపి ప్రభుత్వ హయాంలో సమోసా ఖర్చులను తొమ్మిది కోట్ల రూపాయలుగా చూపడంపై ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ బాధ్యతాయుతంగా పాలించలేని వైనాన్ని ప్రస్తావించారు.మొత్తానికైతే ఢిల్లీ వేదికగా గట్టిగానే సౌండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. వైసిపి వైఫల్యాలను ఎండగడుతూనే తాము ఏం చేస్తామనేది స్పష్టతనిస్తున్నారు.