Data Centers: దేశంలోనే ఏపీకి అతిపెద్ద విదేశీ పెట్టుబడి ఎలా వచ్చింది? గూగుల్ డేటా సెంటర్ ( Google data centre) ఏర్పాటు వెనుక జరిగింది ఏంటి? పేరు మోసిన నగరాలకు కాదని విశాఖ వైపు ఎందుకు మొగ్గు చూపినట్టు? ఇప్పుడు ఇదే ఆసక్తికర చర్చ. 1999- 2004 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. అప్పట్లో సిఎంగా చంద్రబాబు ఉండేవారు. అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామి కూడా. ప్రధానిగా వాజ్పేయి ఉండేవారు. చంద్రబాబుకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. ఆయన సలహాలు, సూచనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారు అప్పటి పెద్దలు. అయితే మళ్లీ అదే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు భారీగా విదేశీ పెట్టుబడులు వస్తున్న తరుణంలో.. కేంద్ర పెద్దల వద్ద చంద్రబాబు గౌరవం పెరిగినట్లు అయ్యింది.
* ఇదే పెద్ద పెట్టుబడి..
విశాఖలో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్( ridden Infotech India Private Limited) ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పవర్ డేటా సెంటర్ను విశాఖలో ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దాదాపు 87 వేల 250 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయింది. ఏపీ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడి ఇది. 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం అప్పట్లో కూడా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఓ విదేశీ పరిశ్రమ ప్రకాశం జిల్లాలో 25 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. అప్పట్లో అదో రికార్డ్. కానీ అప్పట్లో ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబుకు అంత మంచి గట్టి సంబంధాలు ఉండేవి కావు. దాని ఫలితంగానే అప్పట్లో ఆశించిన స్థాయిలో కేంద్రం నుంచి సహాయం అందలేదన్నది బహిరంగ రహస్యం.
* కేంద్రాన్ని ఒప్పించి..
వాస్తవానికి విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ ముందుకు వచ్చింది. కానీ కొన్ని రకాల షరతులు పెట్టింది. అయితే భూమి కేటాయింపు తో పాటు కొన్ని రకాల మినహాయింపులు ఇవ్వవచ్చు. కానీ డేటా సెంటర్కు సంబంధించిన పాలసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఆ పాలసీ ఉంటుంది. అయితే విశాఖలో గూగుల్ సెంటర్ ఏర్పాటుకు ఈ పాలసీలో కొన్ని మినహాయింపులు ఇవ్వాలని గూగుల్ కోరింది. అందుకే జాప్యం జరిగింది. అయితే ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రితో ప్రత్యేకంగా చర్చించారు. దీంతో డేటా సెంటర్ పాలసీలో మార్పులకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కొన్ని రకాల పన్ను మినహాయింపు కూడా ఇచ్చింది. దీంతో డేటా సెంటర్ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది.
* చంద్రబాబు చొరవతోనే..
కేవలం చంద్రబాబు( CM Chandrababu) ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్లే గూగుల్ సెంటర్ విశాఖలో ఏర్పాటుకు మార్గం దొరికింది. గూగుల్ పెట్టుబడులు పెట్టేందుకు చాలా నగరాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలు భూములు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ చంద్రబాబు ద్వారా డేటా పాలసీని కేంద్రం మారుస్తుందని.. ఆయన అయితేనే మనకు వర్కౌట్ అవుతుందని గూగుల్ ఒక నిర్ణయానికి వచ్చింది. తమ కీలక ప్రతిపాదనలు ఏపీ ప్రభుత్వం ముందు పెట్టింది. కేంద్రాన్ని చంద్రబాబు ఒప్పించడంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. మరోవైపు విశాఖలో మూడు చోట్ల గూగుల్ కు స్థలం కేటాయించింది ఏపీ ప్రభుత్వం. భూ సేకరణ బాధ్యతలను ఏపీ ప్రభుత్వం తీసుకుంది. తర్లు వాడలో 200 ఎకరాలు, రాంబిల్లి అచ్చుతాపురం క్లస్టర్లో నోటా 166 ఎకరాలు, అడవివరంలో 120 ఎకరాలు కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరిన వెంటనే ఆమోదముద్ర వేసింది. 2026 మార్చినాటికి నిర్మాణాలు ప్రారంభించి 2028 జూలై నాటికి పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా 1.80 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని భావిస్తోంది. మొత్తానికి అయితే ఏపీ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడి రావడం గర్వించదగ్గ విషయం. అయితే ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు కృషి మరువలేనిది. రాజకీయంగా ఇప్పుడు గుర్తించకపోయిన భవిష్యత్తు తరాలు మాత్రం సీఎం చంద్రబాబు గురించి మాట్లాడుకోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.